ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాతావరణంలో మార్పులు.. కూరగాయల రైతులకు తప్పని నష్టాలు - కూరగాయల సాగు

Vegetable Farmers: వాతావరణ పరిస్థితులు కూరగాయలు సాగుచేసే రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. విపరీతమైన ఎండ, లేదంటే ముసురుపట్టిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఓ వైపు ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులు.. మరోవైపు అనుకూలించని వాతావరణం వల్ల కూరగాయలు సాగు చేయాలంటేనే రైతులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 2, 2022, 6:21 AM IST

వాతావరణంలో మార్పులు.. కూరగాయల రైతులకు తప్పని నష్టాలు

Vegetable Farmers Problems: వరి సాగు చేసినా దిగుబడులు రాక, వచ్చినా గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతూ విసిగిపోయిన రైతులకు కూరగాయల పంటలు కాస్త ఆశాజనకంగా కనిపించాయి. రైతులు పెద్ద ఎత్తున కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. దొండ, వంగ, కాకర లాంటి పంటలను డ్రిప్ పద్ధతిలో సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తొలినాళ్లలో బాగానే ఉన్నా.. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. లేదంటే ముసురుపట్టి వర్షాలు కురుస్తుండటం రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. వాతావరణంలో అసమతుల్యత ఏర్పడి కూరగాయల పంటల దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి.

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు వాపోతున్నారు. విపరీతమైన ఎండలు, లేదంటే ముసురు పట్టిన వానల వల్ల పంటల దిగుబడి తగ్గిపోతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చీడ పీడలు పెరగడం, పురుగుల మందుల పిచికారీ రెట్టింపు అవడంతో.. పెట్టుబడి పెరిగిపోతోందని అన్నారు. రైతు కూలీల ఖర్చులు, కూరగాయల రవాణా ఖర్చులు పెరిగిపోయయాని తెలిపారు. సాగు ఖర్చు ఏటేటా పెరిగిపోతున్నా.. దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో దొండ, కాకర వంటి పంటలకు ప్రభుత్వం నుంచి రాయితీలు అందేవి. కానీ, ఇప్పుడు ఎలాంటి చేయూత అందడంలేదు. వాతావరణం అనుకూలించక.. చేతికొచ్చిన పంటను కోల్పోతున్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందడం లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రాయితీలు అందించాలని కోరుకుంటున్నాం. -కూరగాయల రైతులు

ఏ పంట సాగు చేసినా ఏదో ఒక రూపంలో నష్టపోతున్న రైతులు.. ఈసారైనా దిగుబడి లాభసాటిగా రాకపోతుందా అనే ఆశతో సేద్యాన్ని విడవకుండా మట్టితోనే సహవాసం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details