Ravella Kishorebabu joined BRS: భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగులు బీఆర్ఎస్లో చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసినా.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత ఖర్చయినా మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామననారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే.. తమది జాతీయీకరణ విధానమన్నారు.
సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో కమిటీలు సిద్ధమయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల 49 వేల గ్రామాలు, 4 వేల 3 వందల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాంతరంగా బీఆర్ఎస్ విస్తరిస్తుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వంటి పథకాలు కావాలని మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో డిమాండ్ ఉందన్నారు. భారత్ రాష్ట్ర సమితి ఒక రాష్ట్రం, కులం, మతం కోసమో కాదని.. బీఆర్ఎస్ దేశం కోసమని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్కు రాజకీయాలు క్రీడ కాదని.. ఒక టాస్క్ అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోడుగా ఉండాలని కేసీఆర్ కోరారు. తమ పీఠాల కిందకు నీళ్లు వస్తాయనుకునే వారు ఏదో మాట్లాడుతుంటారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.