ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POLAVARAM: పోలవరం తొలి దశకు రూ.9,000 కోట్లు..అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణానికి ఇంకా సుమారు 20 వేల కోట్ల రూపాయలు అవసరం కాగా.... తాజాగా కేంద్రం తొలి దశ పేరుతో కొత్త అంచనాలు రూపొందించింది. తొలి దశ కింద నిర్దేశించిన, మిగిలి ఉన్న పునరావాస పనులకు సుమారు 9వేల కోట్లు అవసరమని నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను ప్రాజెక్టు అథారిటీ పరిశీలనకు పంపినట్లు సమాచారం.

POLAVARAM
POLAVARAM

By

Published : May 10, 2022, 4:57 AM IST

పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం తాజాగా తొలిదశ పేరిట కొత్త అంచనాలతో నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి దశ కింద నిర్దేశించిన, మిగిలి ఉన్న పునరావాస పనులకు సుమారు 9వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కకట్టినట్లు తెలుస్తోంది. డిజైన్ల పరిశోధన విభాగం డైరెక్టర్ ఓరా ఆధ్వర్యంలో.. కేంద్ర హైడ్రాలజీ విభాగం, బ్యారేజి కాలువల డిజైన్ల డైరెక్టరేట్, వ్యయ అంచనాల డైరెక్టరేట్, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టరేట్ఈ తొలి దశ అంచనాలు పరిశీలించి నివేదికకు తుదిరూపమిచ్చినట్లు తెలుస్తోంది

మళ్లీ కొత్త అంచనాలు ఎందుకో?

తొలి దశలో ప్రధాన డ్యాం మొత్తం నిర్మాణానికి ఇంకా ఎన్ని నిధులు అవసరమవుతాయి? ఈ దశలో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే పునరావాసానికి ఎన్ని నిధులు అవసరం? కాలువలను నిర్మించేందుకు ఎంత వెచ్చించాలనే వివరాలను పోలవరం అధికారుల నుంచి సేకరించినట్లు తెలిసింది. తొలి దశ ప్రయోజనాల్లో భాగంగా తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు ప్రస్తుతం ఎత్తిపోతల ద్వారా నీటిని గ్రావిటీ ద్వారా అందిస్తే వాటి ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంటుందని లెక్కిస్తున్నారు. గ్రావిటీ ద్వారా ప్రకాశం బ్యారేజికి 80 టీఎంసీలను మళ్లించడం తొలి దశలో భాగమని పేర్కొంటున్నారు. కొన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించనున్నారు. ఇలా తొలి దశకు పరిమితం చేస్తే కొత్త ఆయకట్టు ఏదీ సాగులోకి వచ్చే అవకాశం లేదు. కేవలం తాడిపూడి, పుష్కర, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల నిర్వహణకయ్యే విద్యుత్తు వ్యయం తగ్గించుకునే వీలుంటుంది. గతంలో జల వనరులశాఖ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. తొలి దశకు ఇంకా రూ.10,900 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు.

అయితే తాడిపూడి, పుష్కర డిస్ట్రిబ్యూటర్లు పూర్తయినందున ఆ మేరకు పనులను మినహాయించి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం 2013-14 అంచనాల్లో రూ.20,398.61 కోట్లనే కేంద్రం పరిగణనలోకి తీసుకుని నిధులిస్తోంది. ఆ అంచనాల మేరకు ఇక పోలవరానికి వచ్చే నిధులు అంతంతే. ఇప్పుడు తొలి దశ పేరుతో రమారమి రూ.9,000 కోట్లు కేంద్రం ఇవ్వాలంటే మళ్లీ అన్ని స్థాయిల్లో అనుమతులు లభించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం సవరించిన అంచనాలు రూ.47,725 కోట్లకు ఇప్పటికే రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఆమోదించింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదమూ పూర్తయింది. ఆ అంచనాలనే కేంద్ర జలశాఖ, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించి మంత్రి మండలి అనుమతి పొందితే సరిపోతుంది కదా అన్న చర్చ సాగుతోంది. దీనివల్ల తొలి దశ మేరకు మొదట నిధులిచ్చి ఆ తర్వాత మలిదశ నిధులిచ్చే అవకాశమూ ఉంటుంది కదా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. రూ.47,725 కోట్ల అంచనాలు ఆర్‌సీసీ ఆమోదం పొందే ప్రక్రియకే ఏళ్ల తరబడి సమయం పట్టింది. దీన్ని కొనసాగించి ఎప్పటికప్పుడు తొలి, మలి దశగా విడగొట్టి నిధులిస్తూపోతే సరిపోయే దానికి మళ్లీ కొత్తగా అంచనాలు, ఆమోదం తీసుకుంటున్న తీరు ఆందోళనకు తావిస్తోందని పోలవరం ఇంజినీర్లే కొందరు మథనపడుతున్నారు.

ఇదీ చదవండి:POLAVARAM: ఆలస్యమనుకుంటే.. మీరే డిజైన్లు ఖరారు చేసుకోండి: డీడీఆర్‌పీ

ABOUT THE AUTHOR

...view details