Free Sewing Training in Eluru: ఈయన పేరు ఎస్ ఎమ్ సుభాని. కృష్ణాజిల్లాలో జన్మించిన ఈయన.. వృత్తి రీత్యా ఏలూరులో స్థిరపడ్డారు. దర్జీ కుటుంబం నుంచి వచ్చిన సుభాని.. తండ్రి నుంచి దర్జీ విద్య నేర్చుకున్నారు. ముందు నుంచీ సేవా భావం ఉన్న సుభాని.. తొలుత హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఓ సంస్థను స్థాపించి.. సుమారు వెయ్యి మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. తర్వాతి కాలంలో ఏలూరులోని సత్రంపాడులో స్థిరపడిన ఆయన.. ఘంటసాల స్వరపీఠం పేరుతో మరో సంస్థను స్థాపించి కుట్టులో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. గృహిణులు, మహిళలు సరైన ఉపాధి లేక బాధపడకూడదనే ఉద్దేశంతో ఏళ్లుగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు.
ఒక్కో బృందంలో 10 నుంచి 12 మంది మహిళలు ఉండేలా.. 100 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వారికి కుట్టులో మెళకువలతో పాటు ఆసక్తి, మంచి గాత్రం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి పాటలు పాడటంలోనూ తర్ఫీదునిస్తున్నారు. పనీ-పాట అనే పేరుకు తగ్గట్టే అటు ఉపాధి, ఇటు పాటలు పాడటంలో రెండిట్లోనూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఏలూరులో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ సుభాని వద్ద శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడిన వారితో పాటు.. సొంతంగా షాపులు ఏర్పాటు చేసుకుని నడుపుతున్న వారి సంఖ్య దాదాపు రెండు వేలకు పైనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. తమకు ప్రయోజనం ఉంటేనే కానీ.. ఎలాంటి సాయం చేసేందుకు ముందుకు రాని ఈ రోజుల్లో ఐదు పదుల వయసులోనూ తన వద్దకు ఎంత మంది వచ్చినా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాని.