ROADS: జూన్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా.. ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అడ్డ రోడ్ల సంగతి అటుంచితే.. కనీసం ప్రధాన రహదారులను కూడా బాగు చేయలేదు. ఏలూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.
దేవరపల్లి నుంచి తల్లాడ వెళ్లే జాతీయ రహదారిపై.. నరసన్నపాలెం వద్ద భారీ గోతులు పడ్డాయి. వర్షపు నీరు చేరడంతో కుంటలను తలపిస్తున్నాయి. పెదపాడు మండలం కలవర్రు నుంచి దాసరిగూడెం వరకు ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డు పరిస్థితీ అంతే దారుణంగా ఉంది. వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరు నిలిచి బురదగుంటలా మారుతోంది. ఏలూరు నుంచి ప్రధాన పట్టణాలు కైకలూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు వెళ్లే బైపాస్ రోడ్డు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.