ROAD ACCIDENTS IN AP : శ్రీరామనవమి పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని సబ్‌స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వరావుపేట వైపు వెళుతున్న ద్వి చక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మామ, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా అత్త తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామ సమీపాన సీఐ ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. సీఐ ప్రభాకర్ రావు విధులు ముగించుకుని పండ్లూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ ప్రభాకర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని ప్రాథమిక చికిత్స నిమిత్తం నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్య సేవల కోసం చెన్నైకి తరలించారు. నాయుడుపేట ఆసుపత్రిలో సీఐ ప్రభాకర్‌రావును సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్: బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వాడరేవు నుంచి చీరాలకు ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా కుడివైపుకు తిప్పటంతో ట్రాక్టరును ద్విచక్రవాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాగర్ మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదంలో గవినివారిపాలెం నుంచి చీరాలకు ద్విచక్రవాహనంపై వెళుతూ.. అదుపు తప్పి వి.సుబ్బారావు(45) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.