Dam Design Review Committee on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మార్చి మొదటివారంలో.. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు సందర్శించి.. ఈ ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు. ఆ గణాంకాల ప్రకారమే ఇక్కడ 2.86 శాతం మాత్రమే పనులు జరిగాయని నివేదించారు. గత నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇదే పరిస్థితి ఎలాంటి పురోగతీ లేదు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో మళ్లీ టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రధాన డ్యాం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎడమ కాలువ పనులకు, పునరావాస పనులకు.. వేర్వేరు గుత్తేదారులున్నారు. పనులు ఆలస్యం కావడానికి కొన్నాళ్లు కరోనా.. తర్వాత వేరే కారణాలు చెప్పారు. నిర్మాణంతో సంబంధం లేని పునరావాసం పనులు పూర్తి చేయడం లేదు. ఎడమ కాలువ పనులు ముందుకు సాగడం లేదు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చి ఆ పనులు పూర్తి చేసేవరకూ ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యానికి అంతో ఇంతో కారణం తప్ప, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, అనుబంధ పనులు, పునరావాస పనుల పూర్తికి ఏ ఇబ్బందులు లేకపోయినా పోలవరం ముందుకు సాగడం లేదు.