KOLLERU BIRDS DEATH: కొల్లేరు ప్రాంతంలో సుమారు 189 రకాల పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో వీదేశీ జాతులు 90 రకాలున్నాయి. తూర్పు ఐరోపా, ఉత్తర ఆసియా ప్రాంతాల నుంచి సంతానోత్పత్తి కోసం ఏటా రెండు నుంచి మూడు లక్షల పక్షులు కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. వాటికి ఆవాసంగా ఉండే మాధవవరం, ఆటపాక కేంద్రానికి చెందిన 267 ఎకరాల చెరువులో నీరు పూర్తిగా అడుగంటింది. దీంతో పక్షుల మనుగడ కష్టతరంగా మారింది.
సరస్సులో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుతున్నారని స్థానికులు అంటున్నారు. పరిశ్రమల నుంచి సరస్సులోకి విడిచే వ్యర్థాల వల్ల చేపలు, పక్షులు చనిపోతున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరస్సుల్లోని నీరు వేడెక్కి చేపలు మృత్యువాత పడుతున్నాయి. పక్షులకు తిండి దొరక్క ఆకలితో అల్లాడి చనిపోతున్నాయి. పక్షుల కేంద్రం అభివృద్ధికి ఏటా రూ.25లక్షలు మంజూరవుతున్నప్పటికీ.. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు.