polavaram project works పోలవరం ప్రాజెక్టు నిధుల సమస్య పరిష్కారం కావట్లేదు. ఖర్చు, ప్రయోజనం నిష్పత్తి ప్రాతిపదికన ఇప్పుడు కొత్తగా పోలవరం తొలి దశ నిధులంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖే కొత్త ప్రతిపాదనలు తయారుచేసినా దానికీ అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను ఇవ్వడానికీ కొర్రీలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య పోలవరం నిధులపై కేంద్ర ప్రాజెక్టుల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక సమావేశం ఏర్పాటైంది. పోలవరం తొలి దశ పేరుతో నిధులిచ్చే క్రమంలో ఎదురవుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని దృశ్యమాధ్యమ విధానంలో ఏర్పాటు చేశారు.
మూడేళ్లుగా డీపీఆర్-2కు ఆమోదం ఏదీ?
*పోలవరం ప్రాజెక్టుకు రూ.55,656.87 కోట్లతో రెండో డీపీఆర్ సిద్ధం చేశారు.
*అనేక చర్చలు, ప్రశ్నలు, అభ్యంతరాలు, సమాధానాల తర్వాత 2019 ఫిబ్రవరిలో సాంకేతిక కమిటీ ఆమోదించింది.
*రూ.47,725.74 కోట్లకు సాంకేతిక కమిటీ అనుమతులు మంజూరు చేసింది.
*తర్వాత రివైజ్డు కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) ఆమోదించింది.
*ఈ ప్రతిపాదనలు ఆర్థికశాఖకు వెళ్లి కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే నిధులు తీసుకునే అవకాశం ఉంటుంది.
*కానీ, ఆ ఒక్క అడుగూ ముందుకు పడట్లేదు.
కొలిక్కిరాని తొలి దశ నిధులు
*ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ అంటూ కొత్త పల్లవి ప్రారంభించారు.
*ఇందులో పునరావాసం తప్ప మిగిలిన ప్రాజెక్టు అంతా యథాతథంగా పూర్తి చేస్తారు.
*పునరావాసాన్ని రెండు భాగాలుగా విడగొట్టి 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిల్వచేస్తారు. ఆ మేరకు పునరావాసం ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు.
*ఆ ప్రకారం పోలవరం ప్రాజెక్టుల డైరెక్టరేట్ రూ.10,911 కోట్లకు అంచనా వేసింది. రూ.10,458 కోట్లకు దాదాపు ఖరారు చేశారు.
ఆ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం అవసరం. ఈలోపు పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో కోత, డయాఫ్రం వాల్ రిపేరు తదితర ఖర్చులు తేల్చి ఆ తర్వాత చూద్దామన్నది కొందరు కేంద్ర అధికారుల వాదన. డిజైన్లతో సహా వాటి ఖర్చులు తేల్చాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదని మరికొందరు అంటున్నారు. కేంద్ర జల సంఘం ప్రతిపాదనలకు పోలవరం అథారిటీ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. పోలవరం ఆధారంగా చేపట్టిన వరదజలాల ప్రాజెక్టులనూ ఇందులో పరిగణనలోకి తీసుకుంటోంది. రేపు ఈ ప్రాజెక్టు నిర్వహణ మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో వరద ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది. వరద ప్రాజెక్టులకు, పోలవరం ప్రాజెక్టు నీటి వినియోగానికి సంబంధం లేదని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. పోలవరం నిధులకు, ఆ వరద ప్రాజెక్టులకు సంబంధం లేదు. ఈ అభ్యంతరాలు పరిష్కరించుకునే క్రమంలోనే తాజా సమావేశమని అధికారులు చెబుతున్నారు.
ఖర్చు చేసిన నిధులు రాబట్టుకోలేక...
మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇంకా రూ.2,900 కోట్లు రావాలి. అవి రాబట్టుకునే ప్రయత్నాలూ ఫలించడం లేదు. డీపీఆర్ పరిధిలో లేవంటూ రూ.1,200 కోట్లను పెండింగులో ఉంచారు. డీపీఆర్-2 ఆమోదించకుండా ఇలా అంటే ఎలాగన్నది అధికారుల ప్రశ్న.
ఇవీ చదవండి: