Polavaram Project Retaining Wall: పోలవరం ప్రాజెక్టు గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇటీవల కుంగిన నేపథ్యంలో.. కేంద్రం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. వారివెంట.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి, ఏపీ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కూడా ఉన్నారు. కమిటీ సభ్యులు.. ప్రధానంగా గైడ్‌బండ్ కుంగడానికి గల కారణాలను పరిశీలించడంతోపాటు.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ.. లీకేజీలపైనా దృష్టి సారించారు.
కుంగిన గైడ్‌బండ్‌ను తాత్కాలికంగా సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. శాశ్వతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని కమిటీ ఛైర్మన్ పాండ్యా చెప్పారు. తొలుత గైడ్‌బండ్‌కు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉన్నందున తక్షణమే వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత డిజైన్లను 2,3 రోజుల్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పిస్తే.. అక్కడి నుంచి కేంద్ర జల సంఘానికి పంపి ఆమోదం తీసుకోవాలని తెలిపారు.
Fact Finding Committee at Polavaram: దెబ్బతిన్న గైడ్ బండ్‌ను పరిశీలించిన నిజనిర్ధరణ కమిటీ
తక్షణమే ఆ తాత్కాలిక పనులు చేయాలని సూచించారు. మొదట ప్రాథమికంగా ఒక నివేదిక సమర్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు వారం రోజుల సమయం అవసరమని కూడా.. పాండ్యా పేర్కొన్నట్లు సమాచారం. వీలైతే రాజమహేంద్రవరంలో ప్రాథమికంగా చర్చించి.. ఒక తాత్కాలిక నివేదిక సిద్ధం చేయాలని కూడా కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
నిజనిర్ధారణ కమిటీ.. పోలవరం ప్రాజెక్టులో సమగ్రంగా పరిశీలించింది. కొందరు సభ్యులు ఫొటోలు కూడా తీసుకున్నారు. చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు.. ఎస్‌ఈ నరసింహమూర్తిని అడిగి కొన్ని సందేహాలు.. నివృత్తి చేసుకున్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి.. కొన్ని అంశాలకు సమాధానాలు ఇచ్చారు. గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ మొత్తం దిగువ వరకూ కుంగినట్లు తేల్చారు. సాధారణంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో జాయింట్లు ఉండకూడదు. ఐతే ఇక్కడ జాయింట్లు ఉండటం కూడా ఒక కారణంగా చర్చ జరిగింది.