పెండింగ్‌లో పోలవరం భవిష్యత్తు - ఎన్నికలు రాబోతున్నా తేలని తొలిదశ నిధుల అంశం Polavaram Project Construction Works Are Still Pending:పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ నిధుల వ్యవహారం ఇంకా తేలనేలేదు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలించినా ఇంకా సిఫార్సులు సమర్పించలేదు. ఈ ప్రాజెక్టుకు తదుపరి నిధులు విడుదల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మధ్య ఎంఓయూ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఎంఓయూతో పాటు ఇప్పటికే డీపీఆర్ 2కు కేంద్ర సాంకేతిక సలహామండలి ఆమోదించిన మొత్తానికి లేదా రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన మొత్తానికి అనుమతులు రావాలి. ఈ నెలాఖరు లోపు అనుమతులు రాకుంటే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.
జగన్ సర్కార్ నిర్లక్ష్యం - భారీగా పెరిగిన పోలవరం నిర్మాణ అంచనాలు
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనుల పూర్తికి 36 వేల 449.83 కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర జల సంఘం ఆ ప్రతిపాదనలను పరిశీలించి, కొంత కోత పెట్టి 31వేల 625.38 కోట్ల రూపాయలకే సిఫార్సు చేసింది. ఆ మొత్తం రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. దీనిపై ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించినా వారు ఎంతకు సిఫార్సు చేస్తారనేది తేలలేదు. వారి సిఫార్సులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు వెళ్లాలి. అక్కడి నుంచి ఆర్థికశాఖ ద్వారా కేంద్ర మంత్రిమండలి ముందు ఉంచితే అప్పుడు తొలిదశ నిధులకు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. పోలవరం నిధుల్లో ఇప్పటికే 2వేల కోట్ల వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది.
రాష్ట్రానికి ఎదురుదెబ్బ - ఆ బిల్లులు ఇవ్వలేమంటూ తేల్చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ
పోలవరం ప్రధాన డ్యాం మొత్తం తొలిదశలోనే పూర్తిచేస్తామని అధికారులు చెప్పినా అందులోనూ కొన్ని పనులు పెండింగులో ఉంచినట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రాంతంలో నీళ్లున్నప్పుడు చేయలేని వాటిని రెండోదశలో చేయొచ్చని కేంద్ర జలసంఘం వెల్లడించింది. స్పిల్ వే కాంక్రీటు పనులు కొంతమేర పెండింగులో ఉన్నాయి. వాటిని రెండోదశకే పరిమితం చేయాలని నిర్ణయించారు. గైడ్‌బండ్ నుంచి పైడిపాక కొండవద్ద చేయాల్సిన పనులను కూడా రెండోదశకే చేర్చారు. ప్రధాన డ్యాంలోనే వెయ్యి కోట్ల రూపాయల పనులను రెండోదశకు వదిలినట్లు తెలిసింది. ఇవే కాకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి పచ్చజెండా ఊపితే దానికీ నిధులు అవసరం కానున్నాయి. ఎడమ, కుడి కాలువల్లో పాత డిజైన్ల మేరకే నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల సంఘం సమ్మతించింది. 2010-11 ఆకృతుల ప్రకారం రెండు కాలువల్లో ప్రవాహ సామర్థ్యం తక్కువ. ఆ మేరకే కాలువ తవ్వకం, లైనింగ్, కట్టడాల పనులకు నిధులిస్తామని, మిగిలినవి ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు
నిజానికి పోలవరం పనులకు ఇది కీలక సమయం. జూన్ వరకు పనులు చేయొచ్చు. కానీ నిధులు, డిజైన్లు, కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతూనే ఉంది. జనవరి నెలాఖరు లోపు ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోతే ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఇక పోలవరం అడుగులు ముందుకు పడవు. పోలవరం అధికారులు దిల్లీ వెళ్లి రివైజ్డ్ కాస్ట్ కమిటీలోని నిపుణుల అనుమానాలపై క్లారిటీ ఇచ్చినా, ఇంకా ఈ అంశం కొలిక్కి రాలేదు. పోలవరంలో సాంకేతిక అంశాలు తేలే సూచనలూ కనిపించట్లేదు. అంతర్జాతీయస్థాయి డిజైన్ నైపుణ్యం ఉన్న ఏజెన్సీ వస్తే తప్ప పోలవరంలో సాంకేతిక అంశాలు ముందుకు సాగే అవకాశం లేదు.