Eluru fire accident: ఏలూరులో అగ్ని ప్రమాద ఘటనపై.. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
సానుభూతి తెలిపిన ఉపరాష్ట్రపతి.. ఏలూరు ఘటన అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి:ఏలూరులో అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అధికారుల నుంచి.. గవర్నర్ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్:ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై.. సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు.
బాధితులకు న్యాయం చేయాలి:ఏలూరు ప్రమాద ఘటనపై.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణపై యాజమాన్యాలు రాజీపడొదన్న ఆయన.. తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై చర్యలు తీసుకుని.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు.
ఆరుగురు మరణించడం చాలా బాధాకరం:ఏలూరు పోరస్ పరిశ్రమ ప్రమాదంపై తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి ఆరుగురు చనిపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు.
ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారమా..?:పోరస్ కెమికల్ కర్మాగారం పేలుడు ఘటన అత్యంత విచారకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతిచెందటం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ స్పందిస్తూ.. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలన్నారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై నిరంతరం తనిఖీలు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి
కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం:ఏలూరు ప్రమాద ఘటనపై.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడినవారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను.. విజయవాడ జీజీహెచ్‌లో సోము పరామర్శించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్న ఆయన.. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని ఆవేదన చెందారు. సీఎం పరిహారం ఇస్తామంటున్నారు కానీ.. ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా ? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
సంబంధిత కథనం: