SI Suspended In Eluru District: ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. మండలంలోని వేగివాడలోని ఆత్మహత్య చేసుకున్న తల్లీకుమార్తెల కేసులో అలసత్వం వహించారని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఎస్ఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే: వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులకు వెళ్లే యువకుడు కాట్రు చిట్టిబాబు పరిచయమయ్యాడు. అతడు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు తీశాడు. విషయం బయటకు చెబితే ఫొటోలను గ్రామంలోని యువకులకు చూపిస్తానని బెదిరించాడు. 13వ తేదీ సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. విషయం గ్రామస్థులకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళనకు గురై తల్లీకుమార్తె 16వ తేదీన ఇంటి వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించి కుటుంబీకులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం మధ్యాహ్నం, తల్లి శనివారం ఉదయం చనిపోయారు. మృతుల రక్తసంబంధీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.