Pawan Kalyan Varahi Vijaya Yatra: వారాహి విజయ యాత్రలో భాగంగా.. ఏలూరులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన నాయకులు, వీరమహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు తావిస్తుండటంతో.. దానిపై స్పందించారు. మరోసారి యువతులు అదృశ్యం గురించి చెప్తూ.. అందరు వాలంటీర్లూ ఇదే పని చేస్తున్నారని చెప్పనని.. వాలంటీర్లు కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పడు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు అని అడిగారు. విలువైన సమాచారాన్ని వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారని పవన్ నిలదీశారు.
యువత సామర్థ్యాన్ని అంచనా వేయడం లేదు:వాలంటీర్ల పొట్ట కొట్టడం నా ఉద్దేశం కాదన్న పవన్.. యువత సామర్థ్యాన్ని జగన్ సరిగ్గా అంచనా వేయడం లేదని విమర్శించారు. 5 వేల రూపాయలు ఇచ్చి యువతతో ఊడిగం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు వచ్చేంత కూడా వాలంటీర్లకు రావడం లేదని అన్నారు. డిగ్రీ చదివి 5 వేల రూపాయలకు చేస్తున్నారంటే ఏమిటి అర్థమని ప్రశ్నించారు.
మరోసారి అవే వ్యాఖ్యలు: శ్రమ దోపిడీ చేసే జగన్.. క్లాస్‌వార్ గురించి మాట్లాడుతారా అని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలు భారీ సంఖ్యలో అదృశ్యం అవుతున్నారని మరోసారి పవన్ అన్నారు. మహిళల అదృశ్యంపై కేంద్ర నిఘావర్గాలు స్టడీ చేస్తున్నాయని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశం వేరే కావచ్చని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించారు.