Nuzvid IIIT Students Protest: నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమాన్యం తీరుపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం తగదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల సమీకృత విద్యను అభ్యసించి.. త్వరలో బయటకు వెళ్లబోయే విద్యార్థులకు విశ్వవిద్యాలయ స్థానిక అధికారులు షాక్ ఇచ్చారు. కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చి ఫీజులు మొత్తం చెల్లించాలని.. లేకుంటే బయటకు వెళ్లనివ్వమని.. గత నెల 28వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ ఉత్తర్వులలో ఏం ఉందంటే: ఈ నెల 5వ తేదీ లోపు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాలని, ఈ లోపు విద్యాసంస్థకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలను చెల్లించాలని.. లేకుంటే బయటకు వెళ్లనివ్వమని హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మే 5వ తేదీన ఉదయం అల్పాహారం తర్వాత ఆఖరి సంవత్సరం విద్యార్థులకు భోజన వసతి ఉండదని, పూర్తిగా ఫీజులు చెల్లించకుంటే క్యాంపస్ ఖాళీ చేయడానికి అనుమతించమని అధికారులు చెప్పారు. తగినంత సమయం ఇవ్వకుండా.. హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చి ఫీజులు చెల్లించమనడంపై.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గందరగోళంగా విద్యార్థుల పరిస్థితి: అదే విధంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంటర్న్‌షిప్‌లతో కూడిన ప్లేస్మెంట్స్ కొంతమంది విద్యార్థులు సాధించారు. వారంతా ఈ రోజు.. ఎంపికైన కంపెనీల్లో హాజరు కావలసి ఉంది. కానీ ఫీజు చెల్లించనిదే విద్యార్థులు బయటకు వెళ్లడానికి వీలు లేదని అధికారులు చెప్పడంతో.. విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. తగిన సమయమిచ్చి ఉంటే తమ తిప్పలు తాము పడేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన: అధికారుల తీరుపై విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని, ఒక్క సారిగా ఫీజులు చెల్లించాలంటే తమ వల్ల కాదని చెప్పారు. ఫీజుల చెల్లించడానికి తగిన సమయం ఇస్తే.. ఏదో ఒకలా ఫీజులు చెల్లించే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లం ఉన్నామని.. ఇంత తక్కువ సమయంలో ఉన్న బకాయిలు మొత్తం చెల్లించలేమని తెలిపారు.
స్పందించిన యాజమాన్యం: తమకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయని.. ఈ రోజు హాజరు కావలసి ఉందని చెప్పారు. తమను బయటకు వెళ్లనివ్వాలని యాజమాన్యాన్ని కోరారు. దీంతో విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకున్న యాజమాన్యం.. విద్యార్థులకు అనుకూలంగా స్పందించింది. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.
IIIT Students: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఇవీ చదవండి: