BOY FELL IN BOREWEEL:ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటగ్రామానికి చెందిన మనెల్లి వెంకటేశ్వరరావు, శ్యామల దంపతుల మొదటి సంతానం పూర్ణజశ్వంత్. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పూర్ణజశ్వంత్ ఆడుకుంటూ వెళ్లి స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద బోరుబావిలో పడిపోయాడు. 30 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. పిల్లాడు రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.
తండ్రి పిల్లాడిని పిలుచుకుంటూ కమ్యూనిటీ హాలు వైపు వెళ్లారు. ఆ పిలుపు విన్న బాలుడు లోపలి నుంచి కేకలు వేశాడు. అప్పటికే బాలుడు బావిలో పడి 6.30 గంటలైంది. వెంటనే గ్రామస్థులు వచ్చి తాడు, నిచ్చెనతో బయటకు తీసేందుకు గంటపాటు శ్రమించారు. సాధ్యం కాలేదు. రాత్రి 11.30 గంటలకు స్థానిక యువకుడు కోడెల్లి సురేష్ నడుముకు తాడు కట్టుకుని లోనికి దిగాడు. బోరుకు వేసిన 12 అంగుళాల కేసింగ్ పైపును గతంలోనే తీసి వేయడంతో.. యువకుడు లోనికి దిగేందుకు వెసులుబాటు దొరికింది. పైగా 400 అడుగుల లోతున్న బావి పూడిపోయి.. 30 అడుగులే మిగిలింది. లోనికి దిగిన సురేష్.. పూర్ణజశ్వంత్‌ను తాడుతో కర్రకు కట్టి లాగారు. పాత బోరు కావడంతో లోన దరి కూలి వెడల్పు అయిందని, అందువల్లే పూర్ణజశ్వంత్‌ను సులువుగా రక్షించగలిగామని సురేష్ తెలిపారు. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. సురేష్ సాహసాన్ని స్థానికులు అభినందించారు.