Diaphragm Wall Slightly Damaged at Polavaram : పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాలే అతి కీలకం. ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైనది. గోదావరి నదిలో నీటి ఊట నియంత్రణ గోడగా విదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. అయితే 2021లో వచ్చిన భారీ వరదలకు ఈ డయాఫ్రం వాల్ కొంతమేర దెబ్బతింది. దీనిపై ఎన్‌హెచ్‌పీసీ పరీక్షలు నిర్వహించి నివేదిక అందజేసింది. పైకి ధ్వంసం కాకుండా కనిపిస్తున్న డయాఫ్రం వాల్ దాదాపు బాగానే ఉందని.. అక్కడక్కడ కొంతమేర మాత్రమే దెబ్బతిన్నట్లు ఈ పరీక్షల్లో తేలిందని విశ్వసనీయ సమాచారం. అందువల్ల పూర్తిగా డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం రాకపోవచ్చన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి. దెబ్బ తిన్న ప్రాంతంలో ఏం చేయాలన్న దానిపై నేడు రాజమహేంద్రవరంలో జరగనున్న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మొత్తం 13వందల 96 మీటర్ల మేర డయాఫ్రం వాల్ నిర్మించారు. అయితే ప్రస్తుతం దెబ్బతిన్న చోట ఎన్‌హెచ్‌పీసీ పరీక్షలు చేయడానికి వీలుపడలేదు. ఆ ప్రాంతంలో మరో నిర్మాణం చేపట్టాలన్న యోచన ఉంది. అది కాకుండా కోతలేని ప్రాంతంలో డయాఫ్రం వాల్‌కు పరీక్షలు నిర్వహించారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ పరీక్షలు ఛానల్ 90 మీటర్ల నుంచి 175 మీటర్ల వరకు తిరిగి 363 నుంచి 1190 మీటర్ల వరకు పరీక్షలు చేశారు. సిస్మిక్ టోమోగ్రఫీ పరీక్షలు ఛానల్ 142 మీటర్ల నుంచి 175 మీటర్ల వరకు, తిరిగి 363 నుంచి 1190 మీటర్లు, తిరిగి 363 నుంచి 1120 మీటర్ల వరకు పరీక్షలు చేశారు. మొత్తం మీద ఒక 900 మీటర్ల ప్రాంతంలో నాలుగైదు చోట్ల కొంతమేర డయాఫ్రం వాల్ దెబ్బతిందని .ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. కొన్ని ప్యాచ్ పనులతోనే దీన్ని సరిదిద్దవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఛైర్మన్ పాండ్యాతో పాటు నిపుణులు శనివారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. నేడు రాజమండ్రిలో నిర్వహించే సమావేశంలో దీనిపై లోతుగా చర్చించనున్నారు. సరిగ్గా ఎక్కడ, ఎంత లోతున దెబ్బతిందో ఈ సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. వాటికి పరిష్కార మార్గాలూ కేంద్ర జలసంఘం నిపుణులతో కలిసి ఆదివారం తేల్చనున్నారు. ఈ డిజైన్లు ఆలస్యం కాకుండా చూడాల్సి ఉంటుందని జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరంలో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. ఆలస్యం కాబోదని పాండ్యా భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
డయాఫ్రం వాల్ విషయంలో పరిష్కారాలు ఆదివారం నాడు అంటే నేడు ఓ కొలిక్కి తీసుకువస్తామని పాండ్యా పేర్కొన్నారు. ఒక మనిషి దేహాన్ని స్కాన్ చేసినట్లుగా డయాఫ్రం వాల్‌ను పరీక్షించినట్లు ఎన్‌హెచ్‌పీసీ ముఖ్యులు కపిల్ శ్యాంలాల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పోలవరం రీయింబర్స్ నిధులు 2 వేల 600 కోట్ల రూపాయల వరకు ఇంకా కేంద్రం నుంచి రాలేదని కూడా పాండ్యా వద్ద శశిభూషణ్‌కుమార్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నిధులు ఎంతో ముఖ్యమని ఆయన వివరించినట్లు తెలిసింది.
నేడు కీలక భేటీ: నేడు పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో కీలక భేటీ జరగనుంది. డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై కేంద్ర జల విద్యుత్ సంస్థ కీలక నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, కేంద్ర జలవిద్యుత్ సంస్థ ప్రతినిధులు. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు పోలవరం చేరుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నివేదికపై మంత్రి అంబటి, ప్రాజెక్టు అధికారులు చర్చించనున్నారు.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది కొద్దిగానే..! ఏం చేయాలనే దానిపై నేడు నిర్ణయం - polavaram project latest news
Diaphragm Wall Slightly Damaged : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ కొద్దిగానే దెబ్బతిన్నట్లు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ తేల్చింది. డయాఫ్రం వాల్ దాదాపు బాగానే ఉందని.. అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిందంటూ నివేదికలో వెల్లడించింది. కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మించుకోవాల్సిన అవసరం రాకపోవచ్చన్న దిశగా అధికారులు చర్చిస్తున్నారు. దెబ్బతిన్నంత మేర ఏం చేయాలో నేడు జరిగే డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Diaphragm Wall Slightly Damaged