Most Road Accident On National Highway 16 : ఇది చెన్నై నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి. మొన్నటి వరకు ఈ జాతీయ రహదారి కేవలం నాలుగు వరుసలుగా ఉండేది. ఇటీవలె దీనిని ఆరు వరుసల రహదారిగా విస్తరించారు. రహదారిని విస్తరించడమే ఏలూరు జిల్లా దెందులూరు మండలం శింగవరం పరిధిలోని కొమిరేపల్లి గ్రామస్థులకు శాపంగా మారింది.
ఏలూరు నుంచి గుండుగొలను వెళ్లే మార్గంలో ఈ గ్రామం ఉంటుంది. సాధారణంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలలోకి ప్రవేశించేందుకు వీలుగా అండర్ పాస్లు నిర్మించడం సహజం. ఐతే ఇక్కడ మాత్రం రహదారి విస్తరణలో భాగంగా అండర్ పాస్ ఇవ్వకపోగా గతంలో రోడ్డు దాటేందుకు వీలుగా ఉన్న ఖాళీని సైతం తొలగించడంతో గ్రామస్థులు తమ గ్రామానికి వెళ్లేందుకు జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో రావాల్సి వస్తోంది.
రెండు నెలల్లో ఐదు ప్రమాదాలు : కొమిరేపల్లి గ్రామస్థులు నిత్యం విద్య, వైద్యం, జీవనోపాధి, నిత్యావసరాలు ఇలా పని ఏదైనా జాతీయ రహదారికి అవతలి వైపునున్న గుండగొలను వెళ్లాల్సిందే. గ్రామం నుంచి బయటకు వెళ్లేప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా తిరిగి వచ్చేప్పుడు మాత్రం గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటునే రాకపోకలు సాగిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఇలా రోడ్డు దాటుతూ గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.