Miscreants set fire to endowment office: ఆలయానికి సంబంధించిన సుమారు 3,600 ఎకరాల భూమి పత్రాలు కాల్చిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూమి పత్రాలను కాల్చే ఉద్దేశంతోనా.. లేదా టెండర్ల రికార్డులను కాల్చడం కోసం కార్యాలయానికి నిప్పంటించారా! అన్న కోణంలో విచారణ చేపట్టారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ రఘునాథ స్వామి ఆలయ కార్యనిర్వహరణ అధికారి (ఈఓ) కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో 3,600ఎకరాల భూముల కౌలుదారుల వివరాలతో కూడిన రికార్డులు, పలు ఆలయ రికార్డులు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై ఈఓ విశ్వేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. పలువురిని ప్రశ్నించారు. 1983 వ సంవత్సరం నుంచి రఘునాథ స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములపై రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం స్పందించి డాక్టర్ చల్లా కొండయ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ చల్లా కొండయ్య అప్పట్లో భూ వివాదాల పరిష్కారానికి కృషి చేశారు. కమిషన్ తీరు నచ్చని కొందరు రైతులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు 1996 వ సంవత్సరంలో వెల్లడించిన తీర్పు మేరకు.. సాగులోని చిన్న, సన్నకారు రైతాంగం ఎకరాకు ఒక క్వింటా వేరుశెనగ కాయలు లేదా.. అందుకు సమానమైన ధర ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది.