New Diaphragm Is Not Required : పోలవరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భారీ వరదలతో దెబ్బతిన్న చోట ఎక్కడికక్కడ చిన్నచిన్నగా యు(U) ఆకారంలో సమాంతర డయాఫ్రంవాల్ నిర్మించాలని నిర్ణయించారు. వాటిని ప్రస్తుతం ఉన్న డయాఫ్రంవాల్‌తో అనుసంధానించాలని ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. మొత్తం కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం లేదని జలసంఘం నిపుణులు తేల్చిచెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రంవాల్ స్థానంలో కొత్తది నిర్మించాలన్న ప్రతిపాదనలు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం పెద్ద ఊరటే. జాతీయ జల విద్యుత్ పరిశోధనస్థానం నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో డయాఫ్రంవాల్ రెండో గ్యాప్‌లో 485 మీటర్ల మేర ధ్వంసమైనట్లు తేలింది. కుడి, ఎడమ వైపున భారీ వరదలకు కోతపడిన ప్రాంతంలో 385 మీటర్లు, మద్యంలో మరో 100 మీటర్లు దెబ్బతిన్నట్లు నిపుణుల బృందం తెలిపింది. దీంతో పాటు 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని.. అదంతా సరిదిద్దుకోవాల్సి ఉంటుందని వివరించారు.
పైన దెబ్బతిన్న ప్రాంతంలో ఎక్కడికక్కడ సమాంతరంగా మూడు మీటర్ల ఎగువన యు(U) ఆకారంలో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తారు . ఈ ప్రాంతంలో దిగువన రాయి తగిలే వరకు వెళ్లి అక్కడి నుంచే దీన్ని నిర్మించుకుంటూ వస్తారు. డయాఫ్రంవాల్‌పై భాగంలో దాదాపు 672 మీటర్లు, ఐదు మీటర్ల లోతున దెబ్బతిన్న దానికి మరోక పరిష్కారం చూపారు. ప్రధాన డ్యాం నిర్మించే సమయంలో క్లే కోర్ బదులు అక్కడ ప్లాస్టిక్ కోర్ వేసి సరిదిద్దవచ్చని చెప్పారు. ఇందుకు తగ్గ మెథడాలజీ, డిజైన్లు సిద్ధం చేసి కేంద్ర జల సంఘానికి సమర్పించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్-1 ప్రాంతంలో డయాఫ్రంవాల్‌ను ఈ మధ్యనే 393 మీటర్ల మేర కట్టించారు. వరదల తర్వాతే ఆ నిర్మాణం పూర్తయినందున దానికి నష్టమేమీ జరగలేదు. జీ.కొండ తరువాత కుడి వైపు ఛానల్ 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు మొత్తం 1,396 మీటర్ల మేర డయాఫ్రంవాల్ నిర్మాణాన్ని 2018 లో పూర్తి చేశారు. ఇది అక్కడక్కడ ధ్వంసమైందని తేల్చారు.