MINISTER AMBATI RAMBABU ON POLAVARAM : పోలవరం పనులు చేయడానికి వచ్చే నాలుగైదు నెలలు చాలా కీలకం అని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా గోతులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. డయాఫ్రం వాల్‌కు 22 మీటర్ల వరకు నష్టం జరిగిందని.. పై భాగాలు కొంత మేర కొట్టుకుపోయాయని వివరించారు. డయాఫ్రమ్ వాల్‌కు పరీక్షలు జరిపి జాతీయ జలవిద్యుత్ పరిశోధన సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు.
పోలవరం పనులు చేయడానికి వచ్చే నాలుగైదు నెలలు చాలా కీలకం అని రాంబాబు తెలిపారు. కొన్ని ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు కాబట్టి.. కొంచెం ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు.
ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడంతోనే పనుల్లో ఆలస్యం జరుగుతోందని మరోసారి తెలిపారు. అందుకే ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలని.. అందుకు ఏ విధమైన రిపేర్లు చేయాలో అధికారులు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయడానికి వచ్చే ఆ నాలుగు నెలలు కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
డయాఫ్రమ్ వాల్‌కు ఇరువైపులా గోతులు ఏర్పడటంతో 22 మీటర్ల వరకు నష్టం జరిగిందన్నారు. డయాఫ్రమ్ వాల్‌కు పరీక్షలు జరిపిన ఎన్‌హెచ్‌పీసీ కొంతమేర మరమ్మతులు చేసి ముందుకు వెళ్లవచ్చని తేల్చినట్లు వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ భాగాలను మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం గోతులు పూడ్చడానికే 2 వేల కోట్లు అవసరమవుతాయని తేల్చారు.
రాష్ట్ర ఖజానా నుంచి 3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ఇందులో 1800 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖతగా ఉన్నట్లు తెలిపారు. మిగతా 1200 కోట్లు కూడా కేంద్రమే ఇచ్చేలా ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడంలో తొందరపాటు కన్నా నాణ్యతే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. వర్షాకాలం లోపు నిర్వాసితులను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. వైఎస్‌ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇదని తెలిపిన మంత్రి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగనే ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నేడు పోలవరం ప్రాజెక్టుపై సమావేశ మందిరంలో ముఖ్య భేటీ నిర్వహించనున్నారు. డయాఫ్రం వాల్ పటిష్టతపై కేంద్ర జలవిద్యుత్ సంస్థ ఇచ్చే నివేదిక కీలకం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు , కేంద్ర జలవిద్యుత్ సంస్థ ప్రతినిధులు పోలవరానికి చేరుకున్నారు. డయాఫ్రం వాల్ నివేదికపై ప్రాజెక్టు అధికారులు, మంత్రి అంబటి చర్చించనున్నారు.
ఇవీ చదవండి: