Michaung Cyclone Effect In Andhra Pradesh: రాష్ట్రంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు నిండా మునిగిపోయారు. వర్షాలు కురవటం తగ్గినా పంటలు ఇంకా నీళ్లలో నానుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నుంచి నీరు బయటికి వెళ్లే మార్గం లేక రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే సగం కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే మళ్లీ వ్యవసాయం చేయడం కష్టమేనని దీనంగా చెబుతున్నారు.
Farmers Loss The Crop: చేతికి వచ్చిన పంటను మిగ్‌జాం తుపాను నీటి పాలు చేసిందని పల్నాడు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో వందలాది ఎకరాల్లో పంట నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. మేడవాగు ఉద్ధృతికి వరి, మినుము, శనగ పంటలు పూర్తిగా నీటమునిగాయని తల్లడిల్లుతున్నారు. రూపాయి కూడా తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం కక్షతో రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు నుంచి నీరు కిందికి వెళ్లే పరిస్థితిలేక వందల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. నాలుగున్నరేళ్లుగా ముంపును నివారించే చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. దీని వల్ల ఏటా నష్టాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
Farmers Lost Crops Due To Rains In NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిరప పంట రైతుకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తీవ్రతకు మిరప చెట్లు నేల కొరిగాయి. కాపు, పిందె, కాయ దశలో ఉన్న మిరప చెట్లు బలమైన గాలులకు పడిపోయాయి.