Polavaram: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఇంత జాప్యం జరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలుకొట్టింది. సాక్షాత్తూ రాజ్యసభ వేదికగా మంగళవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టంగా ఈ విషయం తేల్చేసింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌కు పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదని, తాజాగా 2024 జూన్ నాటికి పూర్తి చేయనున్నామని ఆయన వెల్లడించారు. అంతే కాదు, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలున్నాయి.. ఎక్కడ జాప్యం జరుగుతోందో ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన వ్యూహం, ప్రణాళిక లేదని ఆ సమాధానంలో తేల్చి చెప్పారు. సరైన నిర్వహణ ప్రణాళిక లేకపోవడంతోపాటు కొవిడ్‌వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని తేల్చారు.
‘‘పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోంది. 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం 77 శాతం, కుడి కాలువ 93శాతం, ఎడమ కాలువ 72 శాతం పూర్తయింది. దీంతో 2022 ఏప్రిల్‌కు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం తప్పింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 నవంబరులో ఒక కమిటీని నియమించింది.
సమగ్రంగా అధ్యయనం చేసి ఎప్పటికి పూర్తి చేయగలరో, అసలు ఇంత ఆలస్యానికి కారణాలు ఏమిటో తెలియజేయాలని కమిటీని కోరింది. అన్నీ అధ్యయనం చేసి 2022 ఏప్రిల్‌లో పోలవరం అథారిటీకి కమిటీ నివేదిక సమర్పించింది. 2024 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలరని సవరించిన షెడ్యూలు ఇచ్చింది...’’ అని కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు వివరించారు. ‘‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోంది(ఇంప్లిమెంటింగు ఏజెన్సీ). రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంపై చాలినన్ని నిధులు ఖర్చు చేసే సామర్థ్యం లేదు. వ్యూహాత్మక ప్రణాళిక లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సమన్వయం చేయడం లేదు. కాంట్రాక్టు నిర్వహణ, నిర్మాణం చాలినంతగా లేదు...’’ అంటూ ఆంధ్రప్రదేశ్ వైఫల్యాలను తేల్చి చెప్పింది. కొవిడ్ కూడా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఒక కారణమని కేంద్రం పేర్కొంది. ఈ పనులను ప్రస్తుతం మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది.
మూడేళ్లుగా చుట్టుముడుతున్న సమస్యలు:పోలవరం ప్రాజెక్టును మూడేళ్లుగా ఇవే సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తున్నాయో కేంద్రం దాదాపు వాటిని సమర్థించినట్లుగానే అధికారిక ప్రకటన ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలవరం పనులు వేగవంతం చేయలేదు. 8 నెలల పాటు ఆగిపోయాయి. మళ్లీ టెండర్లు పిలిచారు. పాత గుత్తేదారు పనులు సవ్యంగా చేస్తున్నా ఎందుకు మళ్లీ టెండర్లు పిలవడం అంటూ ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.