Illegal Soil Excavations: పేరుకు సాగు భూముల మెరక.. కానీ చేసేది మాత్రం పక్కా వ్యాపారం. ఈ విషయం పోలవరం కుడి కాలువ గట్టును చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో మట్టి, గ్రావెల్ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కాలువ గట్లు, పోలవరం కుడి కాలువ మట్టి గుట్టలు, కొండ గుట్టలు.. ఇలా తవ్వకాలకు అడ్డే లేకుండా పోతుంది.
పోలవరం కుడి కాలువ గట్టు నుంచి మట్టి రవాణాకు జలవనరుల శాఖ నుంచి తీసుకున్న అనుమతులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికీ పొంతన కనిపించడంలేదు. ఈ అక్రమాలపై అధికారులు కన్నెత్తి చూడటంలేదు. వాస్తవానికి పోలవరం గట్టు మట్టిని వ్యవసాయ అవసరాలకు, గ్రామ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు మాత్రమే అనుమతులు ఉండగా.. వీటిని అడ్డం పెట్టుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అందులోనూ పగటి పూట మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉన్నా.. నిబంధనలకు అతిక్రమించి మరీ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.
ఇటీవల దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. అర్థరాత్రి వేళ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న ప్రొక్లెయిన్, తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఇదే విషయమై అటు దెందులూరుతో పాటు ఇటు పెదవేగి అధికారులకు ఆయన సమాచారం అందించారు. మేదినరావుపాలెం, రామారావుగూడెం, ముండూరు గ్రామాల మధ్య ఇష్టారీతిగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నట్లు ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పోలవరం మండలం ఎఎల్ఎన్డీ పేట సమీపంలోని దానవాయి కొండ పరిసరాల్లోనూ రాత్రివేళ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొండలాంటి గుట్టలను సైతం.. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వి తరలించడంతో.. మేదినరావుపాలెం సమీపంలో పోలవరం గట్టు మట్టి కనుమరుగై.. కాలువ మట్టానికి చేరుకుంది.