High Court On Eluru Municipal Corporation commissioner Notices : ఇళ్లు, భవనాలు అక్రమంగా నిర్మించారంటు కూల్చివేత విషయంలో మున్సిపల్ కమిషనర్లు ముద్రిత నమూనాలతో ఉత్తర్వులు జారీచేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అలాంటి ముద్రిత నమూనాలలో ఉత్తర్వులు జారీ చేయవద్దని కమిషనర్లకు తేల్చిచెప్పింది. ముద్రించిన నమూనా ఉత్తర్వులపై సంతకం చేయడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఉత్తర్వులు అందుకున్న వ్యక్తి ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని తగిన కారణాలతో అనుకూల, ప్రతికూల ఉత్తర్వులివ్వాలని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లన్ని తగిన విధంగా వ్యవహరించాలని అందుకు.. ఆదేశాలు ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శికి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఈ మేరకు ఓ వ్యాజ్యంలో తీర్పును వెలువరించారు.
రత్న ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన భవనంలో కొంత భాగాన్ని తొలగించాలని.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ జారీచేసిన నోటీసును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసుకు వివరణ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. గతంలో ఓ సారీ నోటీసులు ఇచ్చారని వాటికి సమాధానమిచ్చామని.. ఇప్పుడూ అలాగే నోటీసులు జారీ చేశారన్నారు. వాటిని పట్టించుకోకుండా కమిషనర్ నిర్మాణ భాగం తొలగింపునకు ఉత్తర్వులిచ్చారన్నారు. వివరణను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తొలగింపునకు కారణాలేమిటో నోటీసులో పేర్కొనలేదన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కోర్టు ఆదేశాల మేరకు వెంకట కృష్ణ హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ న్యాయవాది జి.నరేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. తుది ఉత్తర్వులు జారీచేయడానికి మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్ధిష్ఠమైన ముద్రిత నమూనా ఉంటుందన్నారు. ఆస్తి వివరాలు, పేర్లు మార్చేసి కమిషనర్ ఆ రోజు తేదీతో డిజిటల్ సంతకం చేస్తారన్నారు. ఆ నమూనాలను పరిశీలించిన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. బాధిత వ్యక్తి ఇచ్చిన వివరణపై సమాధానం సంతృప్తిగా లేదని ఒక్కలైన్లో పేర్కొనడం సరికాదన్నారు. ఎందుకు సంతృప్తికరంగా లేదో కమిషనర్ కారణాలను పేర్కొనాల్సి ఉందన్నారు. కారణాలు పేర్కొనకుండా జారీచేస్తున్న ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయని గుర్తుచేశారు.
ఆస్తి కలిగి ఉండటాన్ని మానవ హక్కుగా గుర్తించారన్నారు. అధికరణ 300ఏ కింద రాజ్యాంగ ఆస్తి హక్కు కల్పింస్తోందన్నారు. చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప.. ఏ ఇతర మార్గంలో ఆ హక్కును హరించడానికి వీల్లేదన్నారు. బాధిత వ్యక్తి ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతే తప్ప ఇతర కారణాలు పేర్కొనడం, అభ్యర్థనను తిరస్కరించడానికి సాకులు వెతకడం సరికాదన్నారు. చట్ట నిబంధనల మేరకు ఉత్తర్వులివ్వకపోవడంతో పలువురు న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ సొమ్ము, సమయం వృధా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. పిటిషనర్ వివరణపై చట్టం ప్రకారం రెండు నెలల్లో తగిన ఉత్తర్వులివ్వాలని కమిషనర్‌కు స్పష్టంచేశారు.
ఇవీ చదవండి :