contempt case on Secretary and Chief Engineer: పోలవరం కుడి కాల్వ అక్రమ తవ్వకాలపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఛీఫ్ ఇంజినీర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. పోలవరం కుడి కాల్వ పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సమతాసైనిక్ దళ్ కార్యదర్శి పిల్లి సురేంద్ర బాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు విచారణ జరిపింది. గతంలో తవ్వకాలు నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించినా పరిస్థితులో ఎలాంటి మర్పులు రాలేదని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాలున్నా.. అక్రమ తవ్వకాలు ఆగకపోవడంపై పిటీషనర్ కోర్టు ధిక్కార పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు చేస్తున్న దృశ్యాలను పిటీషనర్ న్యాయవాది ఉమమహేశ్వరరావు కోర్టు ముందు ఉంచారు. కోర్టు ఆదేశించినా తవ్వకాలు జరపడం పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఛీఫ్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
వైఎస్ఆర్ కడప జిల్లా: అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబరులో కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఎన్.రమేశ్‌నాయుడు గతంలో హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. డ్యాం కొట్టుకుపోయిన ఘటనలో అమాయకుల ప్రాణాలు పోయాయని పిటీషనర్ న్యాయవాది గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. గతంలో నష్టపరిహారం, ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి అమలుచేయలేదని న్యాయవాది గోపాలకృష్ణ వెల్లడించారు. వేసవి సెలవులు తర్వాత వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 22 కు వాయిదా వేసింది.