గోదావరి భారీ వరద నేపథ్యంలో పోలవరం విలీన మండలాల్లో యంత్రాంగం అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వందలమంది నిర్వాసితులు కష్టాలు పడుతుంటే వారికి తాత్కాలిక ఆవాసం కూడా కల్పించలేకపోయారు. సరైన వరద సమాచారం కూడా అందించలేదు. పునరావాస కాలనీలు నిండిపోయాయని, తమకు అక్కడ చోటులేకే సొంతంగా గుడిసెలు వేసుకుంటున్నామని పేద నిర్వాసితులు చెబుతున్నారు.
తమకు కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేదని, వరద వస్తుందని ఖాళీ చేయాలన్న సమాచారమూ సరిగా ఇవ్వలేదని అంటున్నారు. కూరగాయలు, బియ్యం పంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో బాధ్యత వహిస్తున్న అధికారులతో మాట్లాడితే తాము అంతా చక్కగా చేశామని, నిర్వాసితులే సరిగా ఉపయోగించుకోవడం లేదని, సాయంతో పాటు.. ఆవాసమూ కల్పిస్తున్నామని చెబుతున్నారు.
వాళ్లు ఇక్కడకు రావడం లేదని, అందరికీ సాయం అందించేశామని చెబుతున్నారు. రెండు పునరావాస కేంద్రాలు ఖాళీ లేక తాము వేరే చోటు వెతుక్కోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారంటే... ఇంకా వేలేరుపాడు స్కూల్లో ఎంతో ఖాళీ ఉందని, ఎవరు వచ్చినా ఆవాసం కల్పిస్తామని జిల్లా స్థాయి అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. ఆ కేంద్రాన్ని పరిశీలిస్తే ఆయన మాటల్లోని డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేకచోట్ల ఈ వైఫల్యం కళ్లకు కట్టింది.
బాధితులు మూడు చోట్లకు మారాలా?
గోదావరికి భారీ వరద వచ్చింది. పై నుంచి ఎప్పుడు, ఎంత వస్తుందో అంచనాలు ఉన్నాయి. కానీ వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో యంత్రాంగం ఎవరినీ ముందుగా హెచ్చరించలేదు, ఖాళీ చేయించలేదు. చాలామంది బాధితులు వేలేరుపాడులో ముంపు వచ్చిందని ఎర్రబోరులో గుడిసెలు వేసుకున్నారు. అక్కడకు వరద వస్తే శివకాశీపురం వచ్చారు. అక్కడికీ వరద రావడంతో మళ్లీ భూదేవిపేటకు వచ్చారు. అక్కడకు వస్తే బండ్లబోరుకు వచ్చారు. వాళ్లు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు.. అదీ ముంపు ప్రాంతమేనని వారించి.. కనీసం పోలీసుల సాయం తీసుకుని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులకు లేదా అన్న విమర్శలు వస్తున్నాయి. అసలు పోలవరంవద్ద 45.72 మీటర్ల అడుగుల నీరు నిలబెడితేనే ఆయా ఊళ్లు ముంపులో చిక్కుకుంటాయని అధికారులకు తెలుసు. కానీ 40 మీటర్ల నీటిమట్టం లేకముందే చాలాగ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. ప్రజలు తమ ఊరు 45.72 మీటర్ల పరిధిలో ఉంది కదా అని ఊరుకోవడం, హఠాత్తుగా నీరు రావడంతో.. సామగ్రి నీళ్లలో వదిలేసి కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది.
చాలీచాలని పునరావాస కేంద్రాలు:
వేలేరుపాడు మండలంలో దాదాపు 6,100 కుటుంబాలు ముంపులో చిక్కుకున్నాయి. వారికి రెండే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివకాశీపురం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయంలోనే ఇవి ఉన్నాయి. ఈ రెండుచోట్ల వెయ్యి కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేసినట్లు ఒక ఉన్నతస్థాయి అధికారి పేర్కొన్నారు. బయట పాకలు వేసుకున్న వారిని పునరావాస కేంద్రాలకు వెళ్లలేదా అని ప్రశ్నిస్తే అవన్నీ నిండిపోయాయని, అందుకే తామిలా శ్రమ పడవలసి వస్తోందని చెప్పారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి మాత్రం.. స్కూల్లో ఇంకా చాలా ఖాళీ ఉందని, ఎవరు వచ్చినా ఆవాసం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ లోతుగా పరిశీలించింది. ఆ పాఠశాలలో 50 గదులున్నాయి. అందులో ల్యాబ్‌ల పేరుతో 12 గదులు మూసి ఉన్నాయి. మిగిలిన 38 గదులు నిర్వాసితులు, వారి సామాన్లతో నిండిపోయాయి. అరుగులపైనా నిర్వాసితులు సామాన్లు పెట్టుకుని ఉన్నారు. సగటున ఒక్కో గదిలో 5 కుటుంబాల చొప్పున 180 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఈ లెక్కన ఇక్కడ ఇంకా ఎంతమందికి ఆశ్రయం కల్పిస్తారని ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఉన్నతాధికారి సమాధానం ఇవ్వలేకపోయారు.