HEAVY FLOOD AT POLAVARM: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూలై నెలలో వందేళ్లలో ఎప్పుడూ నమోదు కానంత వరద ప్రవాహం.. ప్రస్తుతం పోలవరం, దవళేశ్వరం ప్రాజెక్టుల వద్ద నమోదవుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నుంచి ప్రస్తుతం 15.91 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు స్పిల్ వే నుంచి వెళ్తోందని అధికారులు చెబుతున్నారు. భారీ స్థాయిలో వస్తున్న వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు స్పిల్ వేలోని 48 క్రస్ట్ గేట్లును ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు రివర్ స్లూయిస్ గేట్ల గుండానూ వరద నీరు ప్రవాహం దిగువకు వెళ్తోంది.
నదీ ప్రవాహ మార్గానికి అడ్డంగా నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం కారణంగా వరద నీరంతా ప్రస్తుతం 6 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్ వే గేట్ల గుంటా స్పిల్ ఛానల్, పైలట్ ఛానళ్ల మీదుగా నదీ మార్గంలోకి వస్తోంది. మరోవైపు దిగువ కాఫర్ డ్యామ్ ఎత్తు తక్కువగా ఉండటంతో వరద ప్రవాహం వెనక్కి తన్ని దిగువ-ఎగువ కాఫర్ డ్యాంల వద్ద నిండిపోయింది. మరోవైపు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే రేడియల్ గేట్లను డిజైన్ చేశారు. 16 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రేడియల్ గేటు ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని మేఘా ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ గేట్లను ఆపరేట్ చేసేందుకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు కూడా వినియోగంలో ఉన్నాయని వెల్లడించారు.