Gurukula School In Godown: విద్యార్థులకు మామయ్యలా అండగా ఉంటానని సీఎం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏలూరు జిల్లా చింతలపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాల. ఇక్కడ 5 నుంచి పదో తరగతి వరకు మొత్తం 593 మంది చదువుతున్నారు. ఇంతమంది ఉన్నా సొంత భవనం లేక బడి, హాస్టల్‌ను మార్కెట్ యార్డులోని గోదాముల్లో నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా ఇదే తంతు. అద్దెకు తీసుకున్న ఆ రేకుల షెడ్డులో సౌకర్యాలే లేవు. గోడలు లేని ఒక షెడ్డు కింద 4 తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏ తరగతిలో ఏ పాఠం చెబుతున్నారో అర్థంకాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బల్లలు లేక చాపలు వేసుకొని కూర్చొంటున్నారు. రాత్రిళ్లు ఒకే షెడ్డులో అంతమంది నిద్రించలేక ఆరుబయట పడుకుంటున్నారు. శుద్ధ జలం మాటే లేదు. కుళాయిల వద్దే స్నానాలు చేయాల్సిన దుస్థితి. మరుగుదొడ్లూ సరిపోను లేవు.
గోదాములో గురుకుల పాఠశాల.. ఇబ్బందుల్లో విద్యార్థులు
అది ఓ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల. ఆ పాఠశాలకు సొంత భవనం లేక బడి, హాస్టల్ రెండింటిని మార్కెట్ యార్డులోని గోదాముల్లో నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఇలానే గోదాముల్లో కొనసాగుతోంది. ఇంతకి ఇది ఎక్కడంటే..
ఇక ధాన్యం మార్కెట్‌కు వచ్చే సీజన్‌లో విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. యార్డంతా ధాన్యం కుప్పలతో నిండిపోతుంది. ట్రాక్టర్ల మోతతో చదువుకోలేకపోతున్నారు. విద్యార్థులకు ఈ బాధలు లేకుండా చూడాలని 2018లో ఎస్సీ ఉపప్రణాళిక నిధులతో అప్పటి ప్రభుత్వం నూతన భవన నిర్మాణ పనులు చేపట్టింది. అది దాదాపు పూర్తికావచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారింది. పనులు ఆగిపోయాయి. ఇక్కడి పరిస్థితిని గురుకులాల జిల్లా సమన్వయకర్త వాసవి దృష్టికి తీసుకెళ్లగా ‘ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. వారి నుంచి అనుమతి రాగానే భవన పనులు పూర్తి చేసి విద్యార్థులను అందులోకి తరలిస్తాం’ అని తెలిపారు. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేశ్ వివరణ కోరగా.. గురుకుల పాఠశాలను స్వయంగా పరిశీలించానని.. సమస్యలు తన దృష్టికొచ్చాయన్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించామని ఆమోదం రాగానే పనులు మొదలుపెడతామన్నారు.
ఇవీ చదవండి: