Nadendla Manohar: జనసేన నేత నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మూడేళ్లలో అధికారికంగా 1,673 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించారు. కానీ.. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం 3వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన నుంచి రూ.లక్ష అర్థిక సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు జనసేన 7 జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెల 18న కౌలురైతు భరోసా యాత్ర పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కొనసాగుతుందని వెల్లడించారు. రైతులు క్రాప్ హాలీడే కాకుండా... వైకాపా ప్రభుత్వానికి హాలీడే ప్రకటించాలని పిలుపునిచ్చారు.
జేఎస్‌డబ్ల్యూ కంపెనీ:కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మించే జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు నాదెండ్ల ఆరోపించారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థ గతంలో ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్‌కు యత్నించినట్లు పేర్కొన్నారు. ఇందులో అసలు లబ్ధిదారుడు ఎవరో ప్రభుత్వం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
రణస్థలంలో సభ: జనవరి 12న యువశక్తి పేరుతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సభ నిర్వహించనున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు. రణస్థలంలో జరిగే కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల రక్షణ కోసం న్యాయవాదిని నియమిస్తున్నట్లు నాదెండ్ల వెల్లడించారు.