1000 Years Old Chennakesava Swamy Galigopuram: ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో శనివారపుపేట ఉంది. అక్కడికి చేరుకోగానే.. ఎడమవైపున ఎత్తైన గాలి గోపురం ఉంటుంది. పాదచారులతో పాటు వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 100 అడుగుల ఎత్తులో.. నాలుగు అంతస్తులుగా ఉంటూ అశేష శిల్పకళా సంపదతో కనువిందు చేస్తోంది. దీని నిర్మాణం 11వ శతాబ్దం.. చాళుక్యుల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. గోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు.. రామాయణం, శ్రీరామపట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ, ఇతిహాసాలు.. క్షీరసాగర మథనం, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఆళ్వార్లు, ఋషులు, మునులు, వాత్సాయన కామసూత్రకు సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో ప్రాచీన వైభవానికి సంకేతంగా నిర్మించారు.
పూర్తిగా ఇసుక రాతి శిలతో నిర్మితమైన ఈ గాలి గోపురం కొన్నేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా.. 2004లో గోపురం మీదున్న శిలాసంపదను తొలగించి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అయ్యంగార్ చొరవతో.. అనేక పోరాటాల తర్వాత గోపురం వైభవం దెబ్బతినకుండా.. పాడైన వాటిని మాత్రమే తొలగించారు. వాటి స్థానంలో సున్నం, బెల్లం, కరక్కాయ, జనపనార పొట్టు, తుమ్మ జిగురు మిశ్రమాల్ని ఉపయోగించి శిలాసంపదను తిరిగి రూపొందించారు. ఐఐటీ చెన్నై, వరంగల్ నిట్ ప్రొఫెసర్లు, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలిగోపురం పునర్నిర్మాణ విషయంలో పలు సలహాలు, సూచనలు అందించారు. చాళుక్యు రాజుల కాలంలో గోపురం నిర్మితమైనప్పటికీ.. తర్వాతి కాలంలో అప్పటి జమీందార్లు మేకా ధర్మ అప్పారావు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఘన చరిత్ర కలిగిన ఈ గోపురం 2004లో పునర్నిర్మాణం చేసుకోగా.. ప్రస్తుతం అక్కడక్కడా పిచ్చి మొక్కలు మొలిచి.. ఆలనా పాలనకు దూరంగా ఉంటుంది.