ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టుకు.. కొనసాగుతున్న వరద ఉధృతి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో.. గోదావరికి వరద పోటెత్తింది. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. వరద కారణంగా ప్రాజెక్టు స్పిల్​వేలోని 48 రేడియల్ గేట్ల వద్ద భారీగా వరద నీరు చేరటంతో అధికారులు గేట్లు ఎత్తేశారు.

పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి
పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

By

Published : Jul 10, 2022, 7:25 PM IST

Updated : Jul 11, 2022, 7:15 AM IST

పోలవరం, దేవీపట్నం, అయినవిల్లి, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు శ్రీరాంసాగర్‌ జలాశయం గేట్లూ ఎత్తడంతో గోదావరిలోకి అన్ని వైపులా ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రానికి పోలవరం స్పిల్‌ వే 48 గేట్లు ఎత్తారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. సోమవారం ఉదయం వరకు 8 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం స్పిల్‌ వే వద్ద 29 మీటర్లకుపైగా నీటి మట్టం ఉంది. జలాశయంలో 33 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు దిగువన అఖండ గోదావరి కుడి, ఎడమ గట్లను తాకుతూ నది ప్రవహిస్తోంది. పోలవరం వద్ద పరిస్థితిని 3 రోజులు పరిశీలించేందుకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ జి.సూర్యనారాయణరెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నీటి మట్టం సుమారు 8 అడుగులకు పైగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి వద్ద ఇళ్లన్నీ నీటమునిగాయి. స్థానికులు సామగ్రితో పురుషోత్తపట్నం చేరుకున్నారు. సోమవారం ఉదయానికి గండి పోశమ్మ అమ్మవారి ఆలయ గోపురం వరకు వరద చేరే అవకాశాలు ఉన్నాయి. పోశమ్మగండి- పి.గొందూరు గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపైకి నీరు చేరింది. మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. తమ సమస్యలను పరిష్కరించలేదంటూ పి.గొందూరు నిర్వాసితులు అక్కడే ఉండిపోయారు. ఎగువ ప్రాంతాలైన కొండమొదలు పంచాయతీలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు నిర్వాసితులూ అక్కడే ఉన్నారు. వారిని పునరావాస కాలనీలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా ముక్తేశ్వరంరేవు వద్ద పంటు వద్దకు వెళ్లే తాత్కాలిక రహదారి వరదకు కొంతమేర కొట్టుకుపోయింది.

పోలవరం వద్ద గోదావరిలో వరద పెరుగుతుంటే.. మరోవైపు దిగువ కాఫర్‌ డ్యాం రక్షణకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 19.750 మీటర్ల ఎత్తున నీరు ఉంది. దిగువ కాఫర్‌ డ్యాం ఎత్తును యుద్ధప్రాతిపదిక 24 మీటర్ల కన్నా ఎత్తు పెంచేందుకు ఏర్పాట్లు చేశామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు. పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, సలహాదారు గిరిధర్‌రెడ్డి తదితరులు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 16 పొక్లెయిన్లు, 90 డంపర్లు, 5 డోజర్లు, 4 వైబ్రో కాంపాక్షన్‌ యంత్రాలతో పనులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఒక వైపు వరద వస్తుంటే ఇప్పుడు పనుల హడావుడి ఏంటని విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చూడండి :

Last Updated : Jul 11, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details