Fire Accident In Eluru District: ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.
క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బిహార్వాసులుగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ.. ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమదానికి గల కారణాలు,.. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను.. పరిశ్రమ ప్రతినిధులు పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గేట్లు తీయకపోయేసరికి బలవంతంగా లోపలికి వెళ్లాం. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారు. ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదు. అంబులెన్స్‌కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. షిఫ్టులో 150 మంది వరకు పనిచేస్తుంటారు.-బాధితులు
పరిశ్రమ ముందు ఆందోళనలు..అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమ ముందు.. పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు.
గ్రామంలో గాలి, నీరు కలుషితమై.. పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందన్నారు. పంటలు కూడా సరిగా పండట్లేదని.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోపణలు చేశారు. గ్రామం నుంచి కంపెనీని తరలించాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.