Movie Actor Murali Mohan is remodeling a 98year old house: ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా.. కన్న తల్లిని, ఉన్న ఊరిని మరవకూడదంటారు. ఈ విషయాన్ని బలంగా ఒంటబట్టించుకున్న మాజీ ఎంపీ మురళీ మోహన్.. తన తాతల నాటి ఇంటిని పదిలంగా చూసుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన ఇంటిని కోట్లు ఖర్చు పెట్టి పునర్ నిర్మిస్తున్నారు. కనీసం మరో 50 ఏళ్లు సేవలందించేలా సిద్ధం చేయడమే కాకుండా.. దాన్ని ప్రజా అవసరాలకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
ఏలూరు గ్రామీణ పరిధిలోని చాటపర్రు.. మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ స్వగ్రామం. ఆయన తాతగారు మాగంటి సుబ్రమణ్యం.. అప్పట్లోనే గ్రామంలో పెద్ద భవంతి కట్టించారు. ఆ ఇంట్లోనే మురళీ మోహన్ పుట్టి పెరిగారు. ఇక్కడి నుంచే విద్యాభ్యాసం కొనసాగించారు. పెద్దయ్యాక సొంతూరి నుంచే ఏలూరులోని కళాశాలకు వెళ్లి చదువుకునే వారు. అలాగే చాటపర్రులోని ఈ ఇంటి నుంచే సినీ, వ్యాపార రంగాల్లో ప్రవేశించారు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడినా.. సొంతూరిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటున్నారు మురళీ మోహన్. తీరిక దొరికినప్పుడల్లా ఊరిని, ఇక్కడి ఇంటిని సందర్శించడం మురళీ మోహన్‌కు అలవాటు.
1925 సంవత్సరంలో 18 అంగుళాల మందంతో, పూర్తిగా సున్నంతో ఇంటి గోడలను నిర్మించారు. రెండతస్థుల ఈ ఇంటిని ఇందిరా విలాస్‌గా పిలుచుకునేవారు. మురళీ మోహన్ తాత, తండ్రి కాలం చేసిన తర్వాత ఖాళీగా ఉన్న ఇంటిని గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. కొన్నేళ్ల పాటు ఇందులో ఆస్పత్రిని నడపగా.. భవనం శిథిలావస్థకు చేరడంతో మరోచోటుకి తరలించారు.