ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం Government Should Buy Grain : ఏలూరు జిల్లాలో సగం మంది రైతులు పూర్తిగా ధాన్యాన్ని కోయకముందే కొనుగోలు లక్ష్యం పూర్తైందన్న మాటలు అధికారులు నుంచి వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయకముందే లక్ష్యం పూర్తైందని అధికారులు చెప్పడంతో రైతులను ఆందోళనకు గురవుతున్నారు.
సంచుల కోసం రైతులు పడిగాపులు :జిల్లాలో ఇప్పటికే వరి కోతలు సగం వరకు పూర్తి కాగా మరికొంత మిగిలివుంది. మరోవైపు ధాన్యం కోసి కళ్లాల్లో రాసులు పోసి ఉంచిన రైతులకు సంచుల కొరత వెక్కిరిస్తోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో సంచులు అందడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు వ్యవసాయ పరపతి సంఘాల వద్ద సంచుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
బకాయిలు చెల్లించని ప్రభుత్వం :మరోవైపు ఏదోలా సంచులు సంపాదించి ధాన్యాన్ని నింపిన రైతులు వాటిని రవాణా చేసేందుకు లారీల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం తరలించిన లారీలకు నేటికీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వారు ధాన్యం సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నారు. అలా అని రైతులే కిరాయి చెల్లించి ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి తయారైంది.
తేమ, నూక శాతం :కొన్నిచోట్ల రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మధ్య సమన్వయం లోపంతో ఒక ప్రాంతంలోని ధాన్యం మొత్తాన్ని ఒకే రైసు మిల్లు వద్దకు పంపుతున్నారు. దీంతో హమాలీ కొరతతో సకాలంలో ధాన్యం దిగుమతి కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ వంతు కోసం రైసు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తేమ, నూక శాతం పేరుతో రైసు మిల్లు యాజమాన్యాలు తమ నుంచి ఎదురు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులు : రైతు భరోసా కేంద్రాల్లోనూ సకాలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అనూహ్య వాతావరణం మార్పులు సైతం మరింత కలవరానికి గురిచేస్తున్నాయని వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ గడువు ఏమైందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఆత్మహత్యలే దిక్కు అంటున్న అన్నదాతలు :ప్రభుత్వం స్పందించని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు. సకాలంలో సంచులు, రవాణా సౌకర్యాల్ని కల్పించి... చివరి గింజ వరకు రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
" ఆరు ఎకరాలల్లో వరి వేశాము. కోసి వారం రోజుల అయ్యింది. ఇప్పటికి సంచులు రాలేదు. గతంలో లారీ కిరాయిల ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు లారీ కిరాయిలు ఇవ్వటం లేదు. మేము లారీ పెట్టి ధాన్యాన్ని తరలించడం కష్టంగా ఉంది. మమల్ని ఎడిపిస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునే మేము ఈరోజు ఇక్కడ కాపల కాయాల్సి వస్తుంది. " - రైతులు
ఇవీ చదవండి