Nursing Students Protest for Facilities : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల తీసుకువస్తుంటే అందరూ సంబరపడ్డారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ, తమ లాంటి పరిస్థితి పేద కుటుంబానికి రాకూడదని, ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలని వారంతా అనుకున్నారు. అనుకున్న విధంగా నర్సింగ్ కళాశాలలో చేరారు. కానీ అక్కడ మాత్రం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏలూరు జిల్లాలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా సీటు రావడంతో ఇక్కడికి వచ్చి కళాశాలలో చేరారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఇప్పటివరకు 300 మంది విద్యార్థినులు ఈ కళాశాలలో చదువుతున్నారు. కానీ కళాశాలలో చేరినప్పటి నుంచి ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇప్పటివరకు తాము ఏమీ నేర్చుకోలేదని వచ్చే నెలలో పరీక్షలు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర నర్సింగ్ కళాశాలల్లో కంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారని, రూ.24,500 యూనివర్సిటీ ఫీజు అంటూ కాలేజీ గత ప్రిన్సిపల్ వసూలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎటువంటి రిసిప్టు కూడా ఇవ్వలేదని,.. వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పలేదని,.. తాము చెల్లించిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో మాకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
తాము అభ్యసిస్తున్న కళాశాలలోని తరగతి గదులే హాస్టల్ కింద వాడుకుంటున్నామని, ఒక్కొక్క గదిలో 24 మంది విద్యార్థినులు అవస్థలు పడుతున్నామని తెలిపారు. 300 మంది విద్యార్థులకు కేవలం 3 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని,.. ప్రతిరోజు మరుగు దొడ్ల ముందు వరుసలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి నీరు ఉండటం లేదని, నీళ్లు లేక ఒక్కొకసారి స్నానాలు కూడా చేయడం లేదని వాపోయారు. తరగతి గదుల మెయింటెనెన్స్ కోసం తమ వద్ద 300 రూపాయలు వసూలు చేస్తున్నారని కనీసం శానిటేషన్ కూడా చేయించడం లేదని,.. మెమే చేసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. భోజనాలు వస్తే రెండు అంతస్తులు పైకి ఎక్కి తినాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. తమకంటూ ఒక హాస్టల్, ప్రత్యేక మెస్, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
" క్లాస్ రూమ్, ఫ్యాకల్టీ, బాత్ రూమ్ఫెసిలిటీకానీ ఏమీ లేవు. ఫస్ట్‌లో ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం సార్. మా ఫెండ్స్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వాటర్ ఫెసిలిటీ లేదు. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో పడుకునే వాళ్లం. ఇప్పుడు సొంతంగా వాటర్ క్యాన్ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చామా.. బాధలు పడటానికి వచ్చామా? " - గౌరేశ్వరీ, నర్సింగ్ కళాశాల విద్యార్థిని