Acid Attack Victim Died: ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక (35) మృతిచెందింది. గత మంగళవారం ఏలూరులో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఫ్రాన్సిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. ఏలూరులోని జెవీయర్ నగర్‌లో ఉంటున్న ఎడ్ల ఫ్రాన్సిక.. దుగ్గిరాల సమీపంలోని దంత వైద్య కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. ఈమె భర్త రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజినీర్. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విభేదాలు రావడంతో రెండు సంవత్సరాలుగా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గత మంగళవారం రాత్రి విధులకు వెళ్లి స్కూటీపై తిరిగి వస్తుండగా ఇంటికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్‌తో దాడిచేశారు. ఆమె తల, ముఖానికి గాయాలయ్యాయి. ఆమె పరుగులు తీస్తూ ఇంటికి రాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఫ్రాన్సిక అక్కడ చికిత్స పొందుతూ నేడు మరణించింది.
Acid Attack Victim Died: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి.. చికిత్స పొందుతూ మృతి - ఏపీ క్రైం న్యూస్
Acid Attack Victim Died: ఏలూరులో ఒంటరిగా బైక్ పై వెళ్తున్న మహిళపై జరిగిన యాసిడ్ దాడిలో.. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత మంగళవారం ఏలూరులో ఫ్రాన్సికపై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు.
రౌడీ షీటర్ దారుణ హత్య: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి రౌడీ షీటర్ షేక్ బాజీని పాతకక్షల నేపథ్యంలో కొందరు ప్రత్యర్ధులు కళ్లల్లో కారం చల్లి కత్తులతో నరికి చంపారు. అనంతరం కాలనీ శివారులోని చెట్ల పొదల్లోకి మృతదేహాన్ని తీసుకువెళ్లి తగులబెట్టి మట్టితో పూడ్చివేశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి గ్రామీణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బాజీ గతంలో పలు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. హత్య కేసులో ఇద్దరు నిందితులను గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే విధంగా క్లూస్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
యువకులతో ఘర్షణ.. వ్యక్తి మృతి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాలయం ఎదురుగా ఉన్న రాధారంగా నగర్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాధారంగా నగర్‌కి చెందిన ముద్దినేని శ్రీనివాసరావు.. మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఆయన నివాసం ఉంటున్న సమీపంలో వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని చూసేందుకు వెళ్లిన శ్రీనివాసరావు అక్కడ యువకులతో ఘర్షణకు దిగాడు. అతన్ని బలవంతంగా వెనక్కి నెట్టగా రాయి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మృతుని బంధువులు, పోలీసులు రాత్రి వరకు గోప్యంగా ఉంచారు. ఈ విషయం మీడియాకు తెలవటంతో అప్రమత్తమైన పోలీసులు హడావుడిగా రాత్రి 10 గంటల సమయానికి శ్రీనివాసరావు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.