Damaged Roads in Eluru: కీలకమైన రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతూనే ఉంది. ఏలూరు జిల్లాలో గడిచిన నాలుగు సంవత్సరాలలో జిల్లా రహదారులు.. అభివృద్ధి కాదు కదా.... కనీసం మరమ్మతులకు కూడా నోచుకోని పరిస్థితి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఏ రోడ్లు చూసినా అంతా గోతులమయమే. వర్షాకాలం రావడంతో గోతులు పడిన రోడ్లపై ప్రయాణం.. ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. తేలికపాటి వర్షానికే జిల్లాలోని చాలా రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
"అటు చాట్పర్రు-మాదేపల్లి మధ్యలో ఉన్న రోడ్డు ఎస్సీ ఏరియా. ఈ రోడ్డును గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటుసైడు భారీ వాహనాలు వెళ్లడానికి పర్మిషన్ లేదు. కానీ అవేమి లేకుండా పెద్ద పెద్ద వాహనాలు వెళ్తాయి."-కూరపాటి శ్యాంప్రసాద్, ఏలూరు
ఏలూరు నగర పరిధిలోని ఫిల్ హౌస్ పేట 6, 9 డివిజన్ల మధ్య ఉన్న రహదారి.. చిన్న వర్షానికే పూర్తిగా ధ్వంసమైంది. ఏలూరు నుంచి మాదేపల్లి, కైకలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు ఆర్టీసీ బస్సులతో సహా ఏ వాహనమైనా ఈ మార్గం నుంచే ప్రయాణించాలి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి భారీ గోతులతో బెంబేలెత్తిస్తోంది. స్థానికులు చేపలు పడుతూ నిరసన తెలిపారంటే.. ఏ స్థాయిలో ఛిద్రమైందో అర్థం చేసుకోవచ్చు.