Corruption in Eluru Municipal Corporation: అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఏలూరు నగరపాలక సంస్థ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. నగరపాలక సంస్థలో విలీనం చేసిన పంచాయతీ సిబ్బందిని.. వారికే తెలియకుండా తొలగించిన అధికారులు... వారి స్థానంలో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని చేర్చుకున్నారు. దీనికోసం భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.
తీగలాగితే డొంక కదిలిన చందంగా... ఏలూరు నగరపాలక సంస్థ అవినీతి చిట్టా బట్టబయలవుతోంది. గతేడాది ఏలూరు సమీపంలోని 7 గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి. వెంకటాపురం, శనివారపుపేట, సత్రంపాడు, చొదిమెళ్ల, తంగెళ్లమూడి, కొమడవోలు, పోణంగి పంచాయతీలు విలీనం కాగా... ఆయా పంచాయతీల్లో వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బందిని 2021లో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. విలీన పంచాయతీలకు సంబంధించి 430 మంది ఉద్యోగులు ఉండగా... వారిలో అన్ని అర్హతలు ఉన్నా సుమారు 66 మందిని అకారణంగా విధుల నుంచి తొలగించారు. వీరి స్థానంలో అధికార పార్టీ నాయకుల అనుయాయులకు, అధికారులకు నచ్చిన వారితో భర్తీ చేసేశారు. తమను విధుల నుంచి ఎందుకు తొలగించారో తెలియక అధికారులు, కార్పొరేషన్‌ల చుట్టూ ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మభ్యపెట్టి.... పనితీరు సరిగా లేని కారణంగా విధుల నుంచి తొలగించామంటూ చావుకబురు చల్లగా చెప్పారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.