భూమిని ఆక్రమించిన వైసీపీ శ్రేణులు - సీఎం జగన్ చేతుల మీదుగా అధికారికంగా పంపిణీ CM Jagan Nuzvid Tour Today :ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పర్యటించున్న ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పాతరావిచర్ల గ్రామ సమీపంలో కొండమీద ఉన్నఅసైన్డ్ భూములను (Assigned Lands) పేదల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పంపీణీ చేయనున్నారు. గతంలో నల్లగట్టు, బోగందానిగట్టు కొండల పరిధిలోని 141 ఎకరాలను.. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు ఆక్రమించుకున్నారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో మరీదు శివరామకృష్ణ అనే వ్యక్తి సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
CM Jagan Mohan Reddy Distribute Assigned Lands in Nuzvid :కొండలపై ఆక్రమణలు తొలగించామని అవి ప్రభుత్వ పోరంబోకు భూములని.. ప్రస్తుతం అందులో ఆక్రమణలు ఏవీ లేవని ఫిర్యాదుదారుడికి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఇవే భూములను అసైన్డ్ భూముల పేరుతో కట్టబెట్టేందుకు పట్టాలు సిద్ధం చేశారు. 141 ఎకరాల భూమికి 218 మంది రైతులను అర్హులుగా నిర్ణయించగా వీరిలో అత్యధికులు వైసీపీవర్గీయులేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూముల పంపిణీ కోసం ఒక్కొక్కరి నుంచి సగటున 20 వేల నుంచి 70 వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ ఫొటో ఎఫెక్ట్! కేంద్రం కన్నెర్ర - 1,500 కోట్లకు గండి!
హామీలు నెరవేర్చని జగన్ :మామిడికి ప్రసిద్ధి గాంచిన నూజివీడుకు మార్కెట్ సహా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్.. వాటిని తుంగలో తొక్కారంటున్న స్థానికులు.. వైద్య కళాశాల, ఇండోర్ మైదానం అభివృద్ధి,నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఇలా ప్రతి హామీనీ నెరవేర్చలేదని మండిపడుతున్నారు.
చెట్ల కొమ్మలు నరికివేత.. బారికేడ్లు ఏర్పాటు :గోతులమయం అయిన రోడ్లను ఇంతకాలం పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి పర్యటన వేళ ఆగమేఘాల మీద మరమ్మతులు చేయించారు. మామిడి పరిశోధన కేంద్రానికి పక్కనే సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా ముఖ్యమంత్రి పరిశోధన కేంద్రంలో నుంచి సభకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో పరిశోధన కేంద్రంలో మామిడి చెట్ల కొమ్మలను నరికేయగా అవసరం లేకున్నా పరిశోధన కేంద్రం గోడను కొంతమేర తొలగించి సభా ప్రాంగణానికి సీఎం చేరుకునేలా దారి ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే మార్గంలో దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కూరగాయలు, పండ్ల దుకాణాలకు అడ్డంగా వాటిని ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒంగోలులో అధికార పార్టీ నేతల అండతో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు
విద్యార్థుల తల్లిదండ్రులకు అవస్థలు : సీఎం పర్యటన నేపథ్యంలో సభ కోసం జన సమీకరణకు డ్వాక్రా సంఘాలు, సచివాలయ సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ వాలంటీర్ల ద్వారా జనాన్ని సమీకరించాలంటూ ఎమ్మెల్యే కుమారుడు దిశానిర్దేశం చేశారు. సీఎం సభ కోసం జనాలను తరలించేందుకు పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను పంపాలని ఇప్పటికే యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శుక్రవారం బస్సులు, వ్యాను సౌకర్యం లేనందున విద్యార్థులను వారి తల్లిదండ్రులే పాఠశాలలకు తీసుకురావాలంటూ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సంక్షిప్త సమాధానాలు పంపించాయి.
YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల భూ అక్రమాలు.. చివరకి పేదల భూములనూ వదలటం లేదు..