పోలవరానికి జగన్ పాలన శాపం - పెండింగ్‌లో కీలక పనులు CM Jagan Negligence on Polavaram Project :పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయిని. అలాంటి ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రానికి ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి జగన్ తన వైఖరితో వెనక్కి నెడుతున్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు సైతం అనిశ్చితిలోకి నెట్టేశారు. రివర్స్ టెండర్ల నిర్ణయం వద్దని కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ చిలకకి చెప్పినట్లు చెప్పినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది.
సలహాలు తీసుకోలేదు :టెండర్ ప్రక్రియ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనేది మా ఆందోళన. ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగకూడదనేది కూడా ముఖ్యం. అందుకే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాం. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే చెప్పాం. రీ-టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని మేము సలహా ఇచ్చాం. దీని వల్ల నష్టమే జరుగుతుంది. రీ-టెండరింగ్‌పై ముందుకెళ్లద్దని సలహా ఇచ్చాం. ఆర్‌కే జైన్, పీపీఏ సీఈఓ
రివర్స్ టెండర్లు - పనులు వరదపాలు :హితవాక్యాలను ఎన్నడూ చెవికెక్కించుకున్న చరిత్రలేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరకు తాను అనుకున్నదే అమలు చేసింది. రివర్స్ టెండర్లతో గుత్తేదారుడిని మార్చేసింది. కొత్తగా పనులు చేపట్టిన ఆ గుత్తేదారు ఏడాదిన్నరకుపైగా పనులు వదిలేశారు. చేసిన పనుల్నీ గోదావరి వరదపాలు చేశారు. నిపుణులు హెచ్చరించినట్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుత సీజన్‌లో పోలవరం ప్రాజెక్టులో ఏ పని చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది.
పెండింగ్‌లో పోలవరం భవిష్యత్తు - ఎన్నికలు రాబోతున్నా తేలని తొలిదశ నిధుల అంశం
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే :అనిశ్చితి నుంచి బయట పడేసేందుకు సీఎంగా ఉన్న జగన్ ఏమైనా చేశారా? చొరవ చూపారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నవంబరు నుంచి జూన్ వరకు ఎంతో విలువైన సమయం. వర్షకాలం వెళ్లిపోతుంది. గోదావరికి వరదలు తగ్గుతాయి. పనులు చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. విలువైన రోజులు కరిగిపోతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జగన్ సర్కారు నిష్క్రియాపరత్వంతో కీలక పనులన్నీ ఆగిపోయాయి.
పోలవరంపై చంద్రబాబు చర్చలు : చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'వారం వారం పోలవరం' అంటూ సమీక్షలు నిర్వహించేవారు. ఏ స్థాయిలో ఏ సమస్య ఉందో గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలవరం డిజైన్ల ఆమోదం ఆలస్యమవుతోందని గుర్తించి కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. చంద్రబాబు కృషితో కేంద్రం ప్రత్యేకంగా డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఫలితంగా డిజైన్లు ఆలస్యం కాకుండా నిర్ణయాలు తీసుకునే వీలు చిక్కింది.
పండగ రోజు సైతం కేంద్రజల్ శక్తిమంత్రి ఇంటికి వెళ్లి మరీ పోలవరంపై చర్చలు జరిపిన చరిత్ర చంద్రబాబుది. నిర్ణయాల్లో వేగం పెంచేందుకు ఆయన నిత్యం తపించారు. మరి జగన్ సర్కార్ ఏం చేస్తోంది? ప్రాజెక్టుపై నిరంతర సమీక్షల్ని గాలికి వదిలేసింది. పర్యవేక్షణను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు వెళ్లి కేంద్రానికి మొక్కుబడి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు తప్పితే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే తపన జగన్ సర్కార్‌లో ఏ కోశానా కనిపించడం లేదు.
పోలవరంపై జగన్ మోనం : పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌కు జగన్ సర్కార్ ఇంతవరకు పెట్టుబడి అనుమతి సాధించలేదు. ఇంతలో తొలిదశ నిధులు అంటూ ప్రహసనం మొదలుపెట్టారు. ఆ నిధులకైనా పెట్టుబడి అనుమతి వచ్చిందా అంటే అదీ లేదు. 2021 నుంచి తొలిదశ నిధుల తంతు జరుగుతున్నా ఇంతవరకు పెట్టుబడి అనుమతులే రాలేదు. అనేక చర్చోపచర్చల తర్వాత తొలి దశకు 36 వేల 449 కోట్లకు లెక్కలు వేసిన రాష్ట్ర సర్కారు కేంద్రానికి నివేదిక సమర్పించింది.
రాష్ట్రానికి ఎదురుదెబ్బ - ఆ బిల్లులు ఇవ్వలేమంటూ తేల్చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ
పోలవరంఅథారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలించిన తర్వాత కేంద్ర జల సంఘం సుమారు 31 వేల కోట్లకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుపై రివైజు కాస్ట్ కమిటీ ఏర్పాటైంది. 2022 డిసెంబరు 5న నిర్వహించిన సమావేశంలో తొలిదశ నిధులపై చర్చ జరిగింది. వారంలో పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కేంద్రాన్ని అడిగిందీ లేదు.
పరిష్కారం కాని డయాఫ్రం వాల్ సమస్య : పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు సవాల్‌గా మారాయి. చంద్రబాబు హయాంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తైంది. ఇది ఎంతో కీలక కట్టడం. జగన్ సర్కార్ తీరుతో పోలవరం పనులు ఏడాదిన్నర ఆలస్యమయ్యాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదు. అందులో వదిలేసిన గ్యాపులను పూడ్చలేదు. 2020 భారీ వరదలకుడయాఫ్రం వాల్ దెబ్బతింది. సమస్యను నిపుణులు పరిశీలించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. 2020 నుంచి ఇప్పటి వరకూ డయాఫ్రం వాల్ సమస్య పరిష్కారం కాలేదు. అందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపలేదు.
డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలా? పాత కట్టడానికి మరమ్మతులు చేయాలా అన్న విషయాన్ని ఇప్పటికీ తేల్చలేదు. జగన్ హయాంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఆలస్యమైంది. కట్టడాల్లో ఉండాల్సిన సీపేజీ కన్నా అనేక రెట్లు అధికంగా నీరు లీకవుతోంది. ఫలితంగా నిర్మాణ ఉద్దేశమే దెబ్బతింది. కేంద్ర నిపుణులు సీపేజీపై ముందే హెచ్చరించినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదు. తప్పుడు ఫార్ములాతో లెక్కలు కట్టడం వల్ల సీపేజీని సరిగా అంచనా వేయలేదు. ఇప్పుడు ఏం చేయాలా? అని తలపట్టుకున్నారు. కట్టడాల నిర్మాణం పూర్తి చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
రాష్ట్ర అధికారులను నిలదీసిన కేంద్ర జలశక్తి కార్యదర్శి : పోలవరంలో సమస్యలు పరిష్కరించాలంటే అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ అవసరమని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు సాగలేని అనిశ్చితికి పోలవరం వెళ్లిపోయింది. నిపుణుల ఏజెన్సీ నియామకానికి పోలవరం అథారిటీ బిడ్లు పిలవాల్సి ఉంది. డిసెంబరు 5 నాటి సమావేశంలో ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. ఇంతవరకు టెండర్లు ఆహ్వానించలేదని పోలవరం అధికారులే చెబుతున్నారు. ఆ నిపుణులు వచ్చి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప పోలవరంలో పనులు ముందుకు సాగవు. డిసెంబరు 5 నాటి సమావేశంలో కేంద్రజలశక్తి కార్యదర్శి రాష్ట్ర అధికారులను నిలదీశారు. ఇప్పటికే మూడు సీజన్లు దెబ్బతిన్నాయని గుర్తించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో పనుల సీజన్ కోల్పోయే దుస్థితి నెలకొంది.
ముఖ్యమంత్రిగా జగన్ పోలవరంపై నిత్యం కేంద్ర జలశక్తి, జలసంఘం సహా అధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపితే సమస్యలకు పరిష్కారాలు లభించేవి. గతంలో ఒత్తిడి చేసి వేగంగా సమస్యలు పరిష్కరించుకున్న దాఖలాలు ఉన్నాయి. రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి అడుగడుగునా మద్దతు పలుకుతున్న జగన్ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోవడం శోచనీయం.
దేశీయ ఇంజినీరింగ్ నిపుణులతో సాధ్యం కాదు - ఇంటర్నేషనల్ డిజైన్ యూనిట్ ఏర్పాటు చేయాలి : కేంద్ర జలసంఘం