CM Jagan Dendulur Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన.. Y.S.R ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి.. 10:30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దెందులూరు నియోజకవర్గానికి విచ్చేస్తుండడంతో.. ఏర్పాట్ల పేరుతో అధికారులు చెట్లను ధ్వంసం చేసి, పంట పొలాల నుంచి మురుగు వెళ్లే కాలువలను మట్టితో కప్పేశారు.
సీఎం జగన్..దెందులూరు పర్యటన ఏర్పాట్లు పూర్తి:వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కింద నగదు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పాటు బహిరంగ సభ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దెందులూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ కోసం వేదికను ఏర్పాటు చేయగా.. గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ముందుగా తాడేపల్లి నివాసం నుంచి హెలీకాప్టర్‌లో గ్రామంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభా స్థలికి చేరుకోనున్నారు.
రూ. 6,379.14 కోట్లు విడుదల: మూడో విడత వైఎస్ఆర్ ఆసరా కింద రూ. 7.97 లక్షల మహిళా సంఘాలలోని పొదుపు ఖాతాల్లో రూ. 6,379.14 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. ఈ మొత్తం మార్చి 25 నుంచి ఏప్రిల్ 05 వరకు దశల వారీగా మహిళా సంఘాల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సభా వేదిక వద్ద డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలి వరకు రెండు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి వచ్చే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇనుప బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.