ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటాం: చంద్రబాబు - చంద్రబాబు పాదయాత్ర వార్తలు

Chandrababu on YSRCP: రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని...అన్నదాతలను వేధిస్తున్న వైకాపా ప్రభుత్వానికే ఊరి వేద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు వ్యవసాయం మానేస్తే వైకాపా నేతలు గడ్డి తినాల్సిదేనన్నారు. పుట్టిన రోజు సందర్బంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. కేసులకు భయపడకుండా పోరాడాలని.. తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

Chandrababu Tour
Chandrababu Tour

By

Published : Apr 20, 2022, 7:26 PM IST

Updated : Apr 21, 2022, 5:45 AM IST

ఆత్మహత్యలొద్దు.. వైకాపాకే ఉరి వేయండి: చంద్రబాబు

Chandrababu Visit Nuziveedu Constituency: రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. అవసరమైతే వారిని బాధపెడుతున్న వైకాపాకు ఉరివేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులకు తాను అండగా ఉంటాననీ, ముందున్నవన్నీ మంచి రోజులేననీ భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా పాలనలో ఏ రైతయినా సంతోషంగా ఉన్నాడా? మీరంతా పిరికివారనుకుని రేపో మాపో మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. మీరు ఊరుకుంటారా? ఉచిత విద్యుత్తునిచ్చింది ఎన్టీఆర్‌.. దాన్నెలా వదులుతాం? తెలంగాణలో మీటర్లు పెట్టబోమని అక్కడి ముఖ్యమంత్రి చెబుతోంటే జగన్‌కు మాత్రం ఎందుకంత ఉత్సాహం? మీ వ్యవసాయ కనెక్షన్లకు మోటర్లు పెట్టనిస్తారా? మీ ఊళ్లోకి వాళ్లను రానిస్తారా? గతి లేని రైతులే వరి పంట వేస్తారని ఓ మంత్రి అంటున్నారు. ఆ రైతే వరి పండించకపోతే ఆయన గడ్డి తింటారా? ఆ రోజులూ వస్తాయి. మేం రూ.50 వేల రుణమాఫీˆ ఒకేసారి చేశాం. ఇప్పుడేం చేస్తున్నారు? రూ.7,500 ఏటా ఇస్తూ.. 13,500 ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పంట సకాలంలో కొనట్లేదు. కొన్నా డబ్బులివ్వడం లేదు. రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదు. అయినా మీకు రోషం లేదా?

అరెస్టు చేస్తే ఏమవుద్ది? :అరెస్టు చేస్తే అచ్చెన్నాయుడు హీరో అయ్యాడు. చింతమనేని ప్రభాకర్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఎంతమందిపై కేసులు పెడతారు? ఎంతమందిని భయపెడతారు? నేను అనుకుంటే జగన్‌ అసలు బయటకు వచ్చేవాడా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూజివీడుకు నీళ్లు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశా. పట్టిసీమ ఎత్తిపోతల తొమ్మిది నెలల్లో కట్టి కృష్ణా జిల్లాను సస్యశ్యామలం చేశా. చింతలపూడిని మొదలుపెట్టా. వీళ్లొచ్చాక పనులు అటకెక్కాయి. 72 శాతం పూర్తి చేసిచ్చిన పోలవరాన్ని సైతం అవినీతి, రివర్స్‌ టెండరింగ్‌ అంటూ.. తాత్సారం చేశారు. పూర్తయిన పనులనూ నాశనం చేశారు. డయాఫ్రం వాల్‌ ఇసుకలో పూడుకుపోయింది. దాన్ని వెలికితీయాలంటే రూ.800 కోట్లు కావాలని కేంద్రం తాజా నివేదిక ఇస్తే బాధేసింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నింటిపైనా బాదుడే:నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ నీళ్లిద్దామనుకున్నా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధేస్తోందని చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అన్నింటిపైనా బాదుడే బాదుడు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ప్రభుత్వం ఇదే. నేను అధికారం కోసం రాలేదు. రాష్ట్ర పరిస్థితి మీకు చెప్పేందుకే వచ్చా.. ఆలోచించండి. ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని విని చాలా బాధేసింది. మంచి రోజులొస్తాయి. నేను రైతుల బాధ్యత తీసుకుంటా. ఆక్వా రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. మేం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ ఇప్పుడు పెట్టుకోవాలంటే వారు రూ.3.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

సన్నాలు అన్నారు.. ఉన్న బియ్యమూ పోయింది:సన్నబియ్యం అన్నారు. ఇప్పుడు సన్నబియ్యంతో పాటు ఉన్న బియ్యం కూడా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘కిలో రూ.40 నుంచి రూ.50కి కొనే బియ్యానికి 12 రూపాయలు ఇస్తారట. ఆయన తెలివితేటలు ఎవరికైనా ఉంటాయా? బియ్యం తీసుకోవట్లేదనే సాకుతో రేపు రేషన్‌కార్డు తీసేస్తారు. ఆ తరువాత.. ఉపకారవేతనాలు, పింఛన్లు ఏవీ రావు. జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇవన్నీ ఎవరు తీర్చాలి? శ్రీలంక పరిస్థితి ఏమైంది? దివాలా తీసింది. తండ్రి హయాంలోనే రూ.40 వేల కోట్ల దోపిడీ చేస్తే ఇప్పుడెంత చేస్తారు? పేదలకిచ్చే ప్రతి రూపాయిలోనూ 20 పైసలు పేదలకైతే.. 80 పైసలు వైకాపా నాయకులకే’ అని ఆరోపించారు.

మళ్లీ మీరొస్తేనే రాష్ట్రం సుభిక్షం: మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని నెక్కలంగొల్లగూడెం గ్రామస్థులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కొందరు తమ సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టగా, బాబు హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, తాము పొందిన లబ్ధి గురించి మరికొందరు గుర్తు చేసుకున్నారు. వారు వ్యక్తచేసిన అభిప్రాయాలివి..

మళ్లీ మీరే రావాలి:‘విదేశాల్లో చదివే విద్యార్థులకు మీరు చేసిన సహాయంతో ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లా. యుద్ధం వల్ల అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్న మేమంతా.. తిరిగి మీ సహాయంతోనే వెనక్కి రాగలిగాం. ఇప్పుడు మా చదువులు మధ్యలో ఆగిపోయాయి. విద్యార్థులకు మీరందించిన సహకారం ప్రస్తుతం అందట్లేదు. మళ్లీ మీరే రావాలి.. మా సమస్యలు తీర్చాలి’’- యశస్విని, ఎంబీబీఎస్‌ విద్యార్థి

కెనడా వెళ్లి ఉద్యోగం సంపాదించా: ‘ఎస్సీ వర్గానికి చెందిన నేను మూడేళ్ల క్రితం మీ వల్ల కెనడా వెళ్లి చదువుకున్నా. అక్కడే ఉద్యోగం పొంది ఇప్పుడు ఏడాదికి రూ.60 లక్షలు సంపాదిస్తున్నా. కరోనా తరువాత నుంచి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నా. మీరు సీఎం అయితేనే మళ్లీ అభివృద్ధి.. 125కి పైగా సీట్లతో మళ్లీ అసెంబ్లీకి వెళ్లబోతున్నారు’. - ఉదయ్‌ కుమార్‌, గ్రామస్థుడు

ఉదయ్‌ మాటలకు స్పందించిన చంద్రబాబు అతడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇంతకంటే ఏం కావాలి? చదువు గొప్పదనం ఇది. పేదవాళ్లు కష్టపడతారు. పిల్లలను బాగా చదివిస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు అనుకుంటారు. నేనూ ఇదే ఆలోచించా. తల్లిదండ్రులు తమ పిల్లలకు అటెండర్‌ ఉద్యోగం వస్తే చాలు అనుకునే స్థాయి నుంచి అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసే స్థాయి వరకు తీసుకొచ్చా’ అని పేర్కొన్నారు.

వైకాపాలో ఉండీ అవినీతిపై పోరాడుతున్నా: ‘అడవి నెక్కలం, నెక్కలం గొల్లగూడెం.. రెండు గ్రామాలకు కలిపి 143 మంది లబ్ధిదారులకు రెండున్నర ఎకరాల్లో జగనన్న ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ఒక్కో ఎకరం.. రూ. 60 లక్షల చొప్పున కొన్నారు. ఈ రెండున్నర ఎకరాల స్థలం కొనుగోళ్లలోనే స్థానిక నాయకుడు మచ్చా హరిబాబుతో కలిసి ఎమ్మెల్యే తనయుడు రూ. 75 లక్షల మేరకు అవినీతికి పాల్పడ్డారు. ఇవిగో రుజువులు. దీనిపై వైకాపాలో ఉంటూ కూడా కోర్టుకెళ్లి పోరాటం చేస్తున్నా. నా పోరాటానికి మీరు మద్దతివ్వాలి’- కాజా రాంబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు (వైకాపా)

రాంబాబుకు అండగా ఉందాం: చంద్రబాబు:రాంబాబు ప్రసంగిస్తుంటే పలువురు స్థానిక తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో చంద్రబాబు కల్పించుకుంటూ.. ‘వైకాపాలో ఉంటూ కూడా అవినీతికి వ్యతిరేకంగా రాంబాబు పోరాడటం అభినందనీయం. జగన్‌ వల్ల వైకాపా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. రాంబాబుకు పార్టీలకు అతీతంగా మనమంతా అండగా ఉండాలి’ అని చెప్పారు. అంతకు ముందు చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 73 కేజీలు కేక్​ను కట్ చేశారు. అనంతరం భారీ క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. చంద్రబాబు రాకతో అడవినెక్కాలం, నెక్కలంగొల్లగూడెం గ్రామం పసుపు మయంగా మారింది.

ఇదీ చదవండి: CBN Birthday Celebrations: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

Last Updated : Apr 21, 2022, 5:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details