Polavaram Project Guidebund: పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్‌బండ్ విధ్వంసానికి బాధ్యులెవరో తేల్చాలని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని... కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో జరిగిన వైఫల్యాలపై సీరియస్ అయ్యింది. ఈ విషయంలో నిజనిర్ధరణ కమిటీ తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నివేదిక సిద్ధం చేసే పనిలోనే ఉన్నారని... కొంత సమయం పడుతుందని జల్‌శక్తి శాఖలోని కీలకవర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి వరకూ ఈ నివేదిక ఉన్నతాధికారులకు చేరలేదు. కొన్ని పరీక్షల నివేదికలు రావాలని.. వాటి ఆధారంగా నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్ పాండ్యా.. కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది.
గైడ్‌బండ్ ధ్వంసానికి కారణమేంటే నిర్ధారించి.. బాధ్యులెవరో తేల్చాల్సిందేనని.. అధికారులకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్దేశించారు. ఈ క్రమంలోనే ఆ శాఖ కార్యదర్శి వద్ద సమావేశం జరిగింది. ఇందులో గైడ్‌బండ్ వైఫల్యంపైనా కీలక చర్చ జరిగింది. ఎక్కడ లోపం జరిగిందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరులశాఖ నిర్మిస్తోంది. ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. డిజైన్లు ప్రతిపాదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్‌కు వాటిని పంపి... అనుమతులు తీసుకుంటారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యాప్కోస్ పర్యవేక్షణ కూడా ఉంది. ఈ క్రమంలో పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులో ఈ వైఫల్యానికి బాధ్యులను తేల్చి చర్యలు తీసుకోకపోతే.. ప్రధాన డ్యాం నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా ఉండకపోతే ప్రమాదమని... కేంద్ర పెద్దలు కొందరు భావించి... ఈ మార్గనిర్దేశం చేశారని తెలిసింది.
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే రక్షణలో భాగంగా నిర్మించాల్సిన గైడ్‌బండ్‌ను నాలుగు నెలల్లోనే పూర్తిచేయాలనేది... తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికి పైగా పట్టింది. ఇలా నిర్మాణం ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో అనేక మార్పులు జరిగి... ఆ ప్రభావం పడి గైడ్‌బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నాయనే అభిప్రాయాన్ని నిపుణులు ప్రాథమికంగా వ్యక్తం చేశారని తెలిసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వద్ద ఈ అంశం చర్చకు వచ్చింది. తొలుత స్టోన్ కాలమ్స్ నిర్మాణంలో ఆలస్యమయింది. మధ్యలో గోదావరికి భారీ వరద వచ్చింది. దాంతో స్టోన్ కాలమ్స్‌తో అంతకుముందు ఉన్న మట్టి నమూనాల రకాలకు, ఆ తర్వాత వరదల వల్ల మట్టిలక్షణాలు మారిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అక్కడి మట్టిని మళ్లీ పరీక్షించి.., అంతకుముందు చేసిన పరీక్షల ఫలితాలతో పోల్చి చూడాలని నిర్ణయించారు.