AP JAC AMARAVATHI NIRASANA UPDATES: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు ఏపీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఐదు బృందాలుగా ఏర్పడి.. ఏలూరు జిల్లా, నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లా, అమరావతిలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, రిటైర్డ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల గురించి ఈ నెల 9 నుండి చేపట్టనున్న ఉద్యమం గురించి, జీతాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకున్నా పట్టించుకోవటంలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తామంతా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
9వ తేదీ నుండి ఉద్యమం ప్రారంభం:ఏలూరులోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ జెఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికే 9వ తేదీ నుండి ఉద్యమాన్ని చేపట్టనున్నామని.. ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి.. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 11వ పీఆర్సీ అమలులో భాగంగా జరిగిన ఉద్యమం సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తున్నందునే మార్చి 9 నుండి ఏప్రిల్ 3వరకు దశలవారీగా ఉద్యమానికి సిద్దమయ్యామన్నారు.
ఇది ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని..కేవలం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు. స్వయానా ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రే ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు.. ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని పరిస్దితిలో ఈ ఉద్యమానికి సిద్దపడ్డామని తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం కేటాయించిన బడ్జెట్ ఏమౌతుందో? తెలియడం లేదన్నారు.
ఉద్యమ కార్యచరణకు అందరూ కదిలిరండి:నెల్లూరులో సమావేశంలో భాగంగా ఉద్యమ కార్యచరణకు సిద్ధంకండి అని ఏపీ జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి, ఉద్యమ సమస్యలు, హక్కులను కాపాడుకుందాం అనే అంశాలతో ఏపీ జేఏసీ ముందుకెళ్తుందని..ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ కోపరేటివ్ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణిపేర్రాజు తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దుర్భరంగా ఉందని.. ఉద్యమ కార్యచరణకు అందరూ కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫేస్ రికగ్నేషన్‌ను వెంటనే తొలగించాలి:మరోవైపు బాపట్ల జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జి. ఆస్కార్ రావు పాల్గొని పలు విషయాలపై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వట్లేదని.. అంతకు ముందులా కాకుండా బయోమెట్రిక్ స్థానంలో ఫేస్ రికగ్నేషన్ అనే ఒక యాప్‌ని తెచ్చి ఉద్యోగులను చిత్రహింసలకు గురిచేస్తోందన్నారు.