POLAVARAM SURVEY : పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉత్పన్నమయ్యే ప్రభావాలపై.. ఉమ్మడి సర్వే చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకారం తెలిపిందని.. కేంద్ర జలసంఘం వెల్లడించింది. సర్వే ఫలితాల ఆధారంగా.. అవసరమైన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటాయని..పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలతో.. కేంద్ర జలసంఘం జనవరి 25న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు పోలవరం అథార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలిపింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. వచ్చిన అభిప్రాయాలతో కూడిన మినిట్స్‌ను జలసంఘం రాష్ట్రాలకు పంపింది. ‘‘ఒడిశా లేవనెత్తిన అంశాలకు జలసంఘం వివరంగా సమాధానం ఇచ్చింది. సంబంధిత రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం చేయిస్తామని.. జలసంఘం ఛైర్మన్ ఓహ్రా తెలిపారు.
ఎక్కువ విస్తీర్ణంలో ముంపునకు గురయ్యే భూమి విషయంలో.. కరకట్ట నిర్మాణమా లేక భూమికి పరిహారమా అనేది.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ చెప్పాలని ఓహ్రా కోరారు. తమకున్న ఆందోళనలను తెలంగాణ లేవనెత్తి పరిష్కరించుకొందని.. ఒడిశా కూడా ఇదే రకంగా వ్యవహరించాలని.. జలసంఘం ఛైర్మన్ సూచించారు. తాను చేసిన సూచనకు తెలంగాణ అంగీకరించిందని.. ఆరు పెద్ద వాగులపై సంయుక్త సర్వేను కేంద్ర జలసంఘం చేపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు దీనికి అంగీకరించి తదుపరి కార్యాచరణకు సంబంధించి తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు.. ఓహ్రా పేర్కొన్నారు.