AP Chief Minister Jagan Mohan Reddy Dendulur Tour overall updates: ''రాష్ట్రంలో మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాను. ఇక, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని ఆనాటి పాదయాత్రలోనే మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారమే.. ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాను. రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచాము. డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నాము. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించాము. ఇప్పుడు మూడో విడతలో రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఈరోజు నుంచి ఏప్రిల్ 5వ తేదీవరకూ 10 రోజుల్లో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తాము. ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం.'' అంటూ ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం 78.94 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 6 వేల 419 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఏటా 30 వేల కోట్ల రుణాలు ఇస్తున్నామన్న సీఎం.. 99.55 శాతం చెల్లింపులతో పొదుపు సంఘాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు.
పొదుపు సంఘాల్లో విప్లవాన్ని ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలించే పరిస్థితిని తీసుకొచ్చామని తెలిపారు. 91 శాతానికి పైగా సంఘాలు ఏ గ్రేడ్ సంఘాలుగా మార్పుచెందాయన్న జగన్.. మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 45 నెలల పరిపాలనలో మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించారు.