HEAL School: ఆ స్కూల్ అనాథలకు, అత్యంత పేద పిల్లలకు, అదే విధంగా అంధులకు, వివిధ కారణాల వలన జీవితంలో ప్రేమకు నోచికోని వారి కోసం ఏర్పరచినది. ఇటువంటి వారికి ఆ స్కూల్ స్వాగతం పలుకుతోంది. ప్రేమను అందిస్తోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆదుకుంటోంది. ఆ స్కూల్ పేరే హీల్ స్కూల్. ఇంతకీ హీల్ అంటే ఏంటో తెలుసా.. హీల్.. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, విద్య అందించాలనే మంచి దృక్పథంతో.. పేద పిల్లలకు, అనాధలను ఉచితంగా విద్యను అందిస్తోంది.
ఈ పాఠశాలలో.. పిల్లలు చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమను వారికి అందిస్తారు. వారిని సంతోషంగా ఉంచుతారు. జీవితంలో వారి అభివృద్ధికి కొత్త బాటలు వేస్తారు. పిల్లల ఆసక్తులను గుర్తించి.. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులోని పిల్లలకు.. తల్లిదండ్రులు, ఆత్మీయులు ఏదైతే ప్రేమను ఇస్తారో.. ఆదే ప్రేమను ఇక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇస్తారు.
ఎక్కడ ఉందంటే: మరి ఇంత ప్రేమను ఇచ్చే ఈ హీల్ స్కూల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా.. ఎక్కడో కాదండి మన ఆంధ్రప్రదేశ్‌లోనే. 30 ఎకరాల క్యాంపస్‌లో చూట్టూ ఉన్న సరస్సు, పచ్చటి పొలాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇందులోనే విద్యార్థులకు అవసరమైన ఆహారాన్ని, కూరగాయలను కూడా సహజ సిద్ధంగా పండిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఉంది. దీనికి విజయవాడ విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ క్యాంపస్‌లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
ఇంత అందమైన హీల్ ప్యారడైజ్ స్కూల్లో పిల్లలకు అత్యుత్తమ విద్య, పిల్లలు స్వతహాగా బతికే విధంగా తీర్చుదిద్దుతారు. కేవలం చదువులో మాత్రమే కాకుండా.. ఆటలు, పాటలు ఇలా వివిధ రకాలుగా పిల్లలను ఎంకరేజ్ చేస్తారు. దీని ద్వారా వెనుకబడిన పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తును అందించడంలో తన వంతు కృషి చేస్తోంది ఈ హీల్ ప్యారడైజ్ స్కూల్. ఇందులోని పిల్లలకు సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంగ్లీష్ మీడియం విద్యతో.. ఉచితంగా ఆహారం, వసతి అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పాఠశాలలో 670 మంది వరకూ పిల్లలు చదువుతున్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ పిల్లలు ఉన్నారు. ఇక ఇప్పుడేమో ఈ పాఠశాలలో ఒకటి, రెండవ తరగతి పిల్లలను జాయిన్ చేయడానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అదే విధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు సీట్లు పరిమితంగానే ఉంటాయి. తల్లీ, తండ్రి ఇద్దరూ లేని పిల్లలను ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఎడాది పొడవునా జాయిన్ చేసుకుంటారు.