ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. జ్వరంతో బాధపడుతున్న బాలికకు షుగర్ మాత్రలు! - ఏలూరు వార్తలు

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. జ్వరంతో బాధపడుతున్న బాలికకు ఫార్మసీ సిబ్బంది షుగర్ మాత్రలిచ్చారు. ఆ మందులు వేయగానే బాలిక.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యకం చేసిన బాధితురాలి తల్లి.. ఆస్పత్రిలో ఆందోళన చేపట్టింది.

Eluru Government Hospital
Eluru Government Hospital

By

Published : Apr 29, 2022, 5:27 AM IST

Updated : Apr 29, 2022, 6:49 AM IST

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యంతో 9 ఏళ్ల బాలిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చాటపర్రు గ్రామానికి చెందిన ఓ మహిళ.. జ్వరంతో బాధపడుతున్న తన కుమార్తెను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చింది. వైద్యులు పరీక్షించి మందుల చీటీ రాయగా ఫార్మసీ సిబ్బంది మాత్రలిచ్చారు. ఆ మందులు వేయగానే బాలిక ఒక్కసారిగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. జ్వరానికి బదులు షుగర్‌ టాబ్లెట్‌లు ఇచ్చినట్లు తేలడంతో బాధితురాలి తల్లి ఫార్మసీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాసుపత్రిలో ఆందోళనకు దిగింది.

రుయాలో మరో నిర్లక్ష్యం: తిరుపతి రుయా ఆస్పత్రిలో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24న రాత్రి శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది క్షతగాత్రులు రుయాలో చేరారు. కాలి ఎముకలు విరగడంతో తిరుపతి ఆటోనగర్‌కు చెందిన గోపిని శస్త్రచికిత్స కోసం రుయా ఆర్థో విభాగంలో చేర్చారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరు వెంకటరమణారెడ్డి, తిరుపతి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి వేర్వేరుగా గోపిని పరామర్శించి మెరుగైన వైద్యసేవలందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతికి సూచించారు. అదే రోజు గోపికి శస్త్రచికిత్స నిర్వహించడంతో ప్రస్తుతం వార్డులో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు గురువారం ప్రయత్నించిన ‘న్యూస్‌టుడే’తో క్షతగాత్రుడి భార్య అమ్ములు మాట్లాడారు. ‘నా భర్తను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లాక ఓ నర్సు వచ్చి రూ.3వేలు చెల్లించాలని చెప్పింది. కలెక్టరు, ఇతర పెద్దలు అన్నీ తాము చూసుకుంటామన్నారని చెప్పినా మాట వినలేదు. డబ్బుల్లేక ఇంటికి ఫోన్‌ చేసి మా అత్తను అప్పు తీసుకురమ్మని చెప్పాం. డబ్బు ఇచ్చాక చిన్న పేపరు స్లిప్పు ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్‌ ప్రారంభించారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.3వేలు ఎవరికి ఇచ్చారని ఆరా తీస్తే రుయా ఆస్పత్రికి ఇంప్లాంట్లు సరఫరా చేసే బాలాజీ తీసుకున్నట్లు తేలింది. ఆయన్ని ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా.. అవసరమైన రాడ్లు అందజేసి డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు.

ఇదీ చదవండి:వ్యాపారి నిర్లక్ష్యం.. మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన యువకుడు!!

Last Updated : Apr 29, 2022, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details