Parents Demand Police Investigation: తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఏలూరు మండలం కొక్కిరాయలంక గ్రామస్థులు.. ఉచ్చుల మహంకాళి, రూతమ్మ దంపతులు డిమాండ్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక ఉమెన్స్ క్లబ్ ప్రాంగణంలో దళిత నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తమ కుమారుడు విజయ భాస్కర్ (24) గత నెల 28వ తేదిన సాయంత్రం తన స్నేహితులైన సాయి, వాసు, శ్రీకాంత్, మరికొంత మంది వ్యక్తులు.. పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్లారని చెప్పారు.
ఆ రోజు అర్ధరాత్రి అయినా తమ కుమారుడు ఇంటికి రాలేదని, తెల్లవారుజామున తమ కుమారుడు మొండికోడు వంతెన వద్ద శవంగా కనిపించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెళ్లి చూసేసరికి అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారని, హత్య జరిగిన ప్రదేశంలో పంచనామా నిర్వహించకుండా హడావుడిగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నందున అది హత్యగా తాము భావిస్తున్నామని, కానీ మార్చి ఒకటో తేదీన మృతదేహాన్ని తమకు అప్పగించిన పోలీసులు సరైన విచారణ చేయకుండా హత్యను.. రోడ్డు ప్రమాదంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీఎస్పీకు వినతి పత్రం అందజేశామని తెలిపారు.